AP Minister Vidadala Rajini COMMENTS: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 6వ తేదీన పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో పర్యటించనున్నారని.. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ విధానాన్ని' సీఎం జగన్ ప్రారంభించనున్నారని ఆమె పేర్కొన్నారు. సీఎం జగన్ 6వ తేదీన లింగంగుంట్ల గ్రామానికి విచ్చేస్తుండడంతో నేడు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కృష్ణబాబు, ఎమ్మెల్సీలు తలసిరి రఘురాం, అప్పిరెడ్డి, ఏపీ హెచ్ఎంఐడీసీ ఎండీ మురళీధర్ రెడ్డి, కలెక్టర్ శివశంకర్, ఎస్పీ రవిశంకర్ రెడ్డి, జెసీ శ్యాం ప్రసాదులతో కలిసి ఆమె ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మీడియాతో మాట్టాడుతూ.. ఇంటింటికి వైద్యం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్నా ఫ్యామిలీ డాక్టర్ విధాన కార్యక్రమం దేశంలోనే ఆదర్శంగా నిలువబోతుంది. గత ఏడాది అక్టోబర్ 21 నుంచి ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కార్యక్రమం ట్రయల్ రన్ విజయవంతంగా నడుస్తుంది. ప్రతి సచివాలయ పరిధిలోని రెండువేల జనాభాకు ఏర్పాటు చేసిన.. డాక్టర్ వైయస్సార్ విలేజ్ క్లినిక్ వద్దకు 104 వాహనంలో మండలంలో ఉన్న పీహెచ్సీ వైద్యులలో ఒకరు ప్రతి 15 రోజులకు ఒకసారి వస్తారు. గ్రామంలో అవసరమైన అందరికీ వైద్య పరీక్షలతో పాటు మందులను కూడా ఉచితంగా అందజేస్తారు. దీంతోపాటు గ్రామంలో ఉన్న అంగన్వాడీ, పాఠశాలల్లో విద్యార్థులను కూడా డాక్టర్ వెళ్లి స్వయంగా పరీక్షించి, అవసరమైన వారికి వైద్య సేవలు అందిస్తారు. ఈ కార్యక్రమం దేశంలోనే ఒక ఐకానిక్‌గా నిలుస్తుంది.'' అని ఆమె వ్యాఖ్యానించారు.