Jamia Masjid incident in Palnadu: మసీదు వ్యవహారంలో వ్యాజ్యం దాఖలు చేసిన ఇద్దరు పిటిషనర్లలో ఒకరైన షేక్ ఇబ్రహీం హత్యకు గురికావడంతో.. రెండో పిటిషనర్ షేక్ ఫరీద్‌కు పోలీసు భద్రత కల్పించాలని పల్నాడు ఎస్పీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులిచ్చేంత వరకు భద్రత కొనసాగించాలని పోలీసులకు కోర్టు సూచించింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. సకాలంలో భద్రత కల్పించారా లేదా అన్న విషయం తమ దృష్టికి తీసుకురావాలని పిటిషినర్లకు హైకోర్టు తెలియజేసింది.
పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణం శ్రీరాంపురంలోని జామియా మసీదు నిర్వహణను ఆధీనంలోకి తీసుకునేందుకు మైనార్టీశాఖ, వక్ఫ్ అధికారులు ప్రయత్నిస్తున్నారని, మసీదు యాజమాన్య హక్కుల విషయంలో అధికారులు, ఇతరుల జోక్యాన్ని నిలువరించాలని కోరుతూ నరసరావుపేటకు చెందిన షేక్ ఇబ్రహీం, షేక్ ఫరీద్ ఈ ఏడాది సెప్టెంబర్ 12న హైకోర్టును ఆశ్రయించారు. మసీదు ఆస్తులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా తగిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈవ్యాజ్యం హైకోర్టులో విచారణకు వచ్చింది. వ్యాజ్యం దాఖలు చేసిన మొదటి పిటిషనర్ షేక్ ఇబ్రహీం ఈనెల 20వ తేదీన హత్యకు గురయ్యారని పిటిషనర్ న్యాయవాది అనూప్ కుమార్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
రెండో పిటిషనర్‌షేక్ ఫరీద్‌కు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. హత్య ఘటనకు సంబంధించి బుధవారం పత్రిక కథనాలను కోర్టు పరిశీలనకు ఇచ్చారు. వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోవాలని లేకుంటే చంపేస్తామని పిటిషనర్లకు గతంలో బెదిరింపులు వచ్చాయన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం హత్య జరిగిందన్నారు. షేక్ ఫరీద్‌కు రక్షణ కల్పించాలని హైకోర్టును అభ్యర్థించారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు తక్షణమే పోలీసు భద్రత కల్పించాలని పల్నాడు ఎస్పీని ఆదేశించారు.