ALLEGATIONS ON SATTENAPALLI SI : కుటుంబ గొడవ నేపథ్యంలో ఫిర్యాదు తీసుకోలేదని ఎస్పీకి ఫోన్లో ఫిర్యాదు చేసిన పట్టణంలోని సుగాలీకాలనీకి చెందిన ఆర్. బాలాజీనాయక్‌ను ఎస్సై, కానిస్టేబుల్ లాఠీలతో కొట్టి గాయపరిచారంటూ ఆదివారం సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఆ వివరాల ఇలా ఉన్నాయి.. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలోని సుగాలీకాలనీకి చెందిన బాలాజీనాయక్.. ఇంటి స్థలం వివాదం నేపథ్యంలో అతడి తమ్ముడు కోటేశ్వరరావునాయక్ మధ్య శనివారం గొడవ జరిగింది. తన బావ బాలాజీ నాయక్ మద్యం మత్తులో ఇంటికి వచ్చి గడ్డ పలుగుతో తలుపులు పగులగొట్టి తమపై దాడి చేయబోయారని బాలాజీ సోదరుడి భార్య ఆర్. దుర్గాబాయి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలాజీనాయక్న్ను ఆదివారం ఉదయం స్టేషనకు పిలిపించారు.
ఈ క్రమంలో బాధితుడు తన పైనా దాడి చేశారని ఫిర్యాదు తీసుకోవాలని ఎస్సై ఎ.రఘుపతిరావుని బాలాజీ కోరాడు. ఎస్సై సరిగ్గా స్పందించలేదని అతడు పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చెయ్యడమే కాకుండా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించాడు. తాను మాట్లాడుతుంటే ఎస్పీకి ఫిర్యాదు చేస్తావా అంటూ స్టేషన్లోని ఓ గదిలోకి తీసుకెళ్లి ఎస్సైతో పాటు మరో కానిస్టేబుల్ తనను ఇష్టారాజ్యంగా కొట్టారని బాలాజీ నాయక్ ఆరోపించాడు. ఊపిరి ఆడట్లేదని చెప్పినా వినిపించుకోలేదని, ఫోన్ లాక్కొని కొట్టారని ప్రభుత్వ ఆసుపత్రిలో అతడు విలేకర్లకు తెలిపాడు.