ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గురుకులంలో హాహాకారాలు.. 200 మందికిపైగా బాలికలకు అస్వస్థత - తెలుగు ప్రధాన వార్తలు

Food Poisoning In School: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల బాలికల విద్యాలయంలో 206 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయం నుంచే పిల్లలు ఒక్కొక్కరుగా అస్వస్థతకు గురవుతుంటే, సకాలంలో ఆస్పత్రికి తరలించి వైద్యం అందించకుండా జాప్యం చేశారు.

206 మంది విద్యార్థినులకు అస్వస్థత
Food Poisoning In School

By

Published : Jan 31, 2023, 10:02 AM IST

Updated : Jan 31, 2023, 10:49 AM IST

Food Poisoning In School:పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల బాలికల విద్యాలయంలో 206 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయం నుంచే పిల్లలు ఒక్కొక్కరుగా అస్వస్థతకు గురవుతుంటే, సకాలంలో ఆస్పత్రికి తరలించి వైద్యం అందించకుండా జాప్యం చేశారు. దీంతో కొందరి ఆరోగ్యం క్షీణించి సెలైన్‌ ఎక్కించే వరకు వెళ్లింది.

విద్యార్థినులను ఆటోలో తరలిస్తున్నారు

ఆదివారం మధ్యాహ్నం చికెన్‌, గుత్తివంకాయ కూరలు వండారు. మిగిలిన వాటిని రాత్రికి కూడా వడ్డించారు. సోమవారం ఉదయం అల్పాహారంగా కిచిడీ, సమోసాలు చేశారు. అల్పాహారం తీసుకోకముందు యోగా తరగతులకు హాజరైన వారిలో 20 మంది బాలికలు వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. వారిని గురుకులంలోని ప్రత్యేక గదికి తరలించి, స్టాఫ్‌నర్సుతో వైద్యం అందించారు. అల్పాహారం తీసుకున్నాక మరికొందరికి వాంతులు, విరోచనాలవడంతో వారికీ ఇంజెక్షన్లు ఇచ్చారు. మధ్యాహ్నం వారందరికీ పెరుగన్నం పెట్టారు.

ఆసుపత్రిలో

తరగతులకు హాజరైన బాలికల్లోనూ కొందరు స్వల్ప జ్వరం, వాంతులతో ఇబ్బంది పడ్డారు. కొందరు స్పృహ తప్పి పడిపోయారు. మొత్తంగా 206 మంది అస్వస్థతకు గురవడంతో మధ్యాహ్నం 2గంటల తర్వాత వారందరినీ సత్తెనపల్లిలోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, గురుకుల విద్యాలయాల కార్యదర్శి జయలక్ష్మి, పల్నాడు జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ తదితరులు సత్తెనపల్లికి హుటాహుటిన చేరుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేలా సిబ్బందిని ఆదేశించారు. వైద్యం అందాక 93 మంది కోలుకోగా ఇళ్లకు పంపారు. ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. మిగిలిన 111 మంది బాలికలకు చికిత్స అందిస్తున్నారు. ఇరవై మందిని వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచారు. ఇద్దరిని గుంటూరు సర్వజనాసుపత్రికి తరలించారు. మంత్రుల ఆదేశంతో ఈ ఘటనపై ఆహార కల్తీ నియంత్రణ, రెవెన్యూ, పౌరసరఫరాలు, వైద్యారోగ్య శాఖల యంత్రాంగంతో కమిటీని ఏర్పాటు చేశారు.

ఒకే బెడ్​పై ఇద్దరికి పైగా
నిండిపోయిన ఆసుపత్రి

సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకూ:

ఉదయం 05.30 గంటలు : విద్యార్థినులు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని పాఠ్య పుస్తకాలతో స్టడీ అవర్స్‌లో కూర్చొన్నారు. రాత్రి చికెన్‌ కూరతో తిన్న తరువాత కడుపులో నొప్పిగా ఉందని బాలికలు కొందరు ఒకరికొకరు బాధను పంచుకున్నారు.

ఉదయం 06.30 గంటలు :బాలికలు యోగా తరగతులకు హాజరయ్యారు. ఆసనాలు చేస్తుండగా సుమారు 20 మంది బాలికలు ఒక్కొక్కరుగా గది బయటకు పరుగులు పెట్టారు. వాంతులతో ఇబ్బంది పడ్డారు. ఆరోగ్య సేవల గదిలో వారికి వైద్య సిబ్బంది మాత్రలు ఇచ్చారు. మిగిలిన విద్యార్థినులు భోజనశాలకు చేరుకొని అల్పాహారంగా వేరుసెనగ పచ్చడితో కిచిడి, సమోసా తిన్నారు. అరగంట తర్వాత మరో 30 మంది బాలికలు కళ్లు తిరగడం, వాంతులు, విరేచనాలతో నీరసించిపోయారు. వారందరికీ మాత్రలు, ఇంజక్షన్లు ఇచ్చి విశ్రాంతి గదులకు తరలించి వైద్య సిబ్బంది పర్యవేక్షించారు.

ఉదయం 08.15 గంటలు : తరగతులు ప్రారంభం కాగా, అస్వస్థతకు గురైన బాలికలు మరింత నీరసించిపోయారు. తరువాత మరి కొంతమంది జ్వరం, వాంతులతో బాధపడుతూ ఆరోగ్య సిబ్బంది దగ్గరకు చేరారు. ఆరోగ్య సేవల గది చిన్నది కావడంతో అందరినీ భోజనశాలకు రావాలని సిబ్బంది చెప్పారు. ఇంజక్షన్లు చేసి విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు.

ఉదయం 11 గంటలు :అస్వస్థతకు గురైనవారికి మజ్జిగతో భోజనం అందించారు. తరగతుల్లో బాలికలు విడతల వారీగా వాంతులతో సొమ్మసిల్లిపోయారు. అందరికీ ప్రాథమిక వైద్యం అందించినా ఆరోగ్యం కుదుట పడలేదు. బాధిత బాలికలు నీరసించి నడవలేక వేదనతో రోదించారు.

మధ్యాహ్నం 2.00 గంటలు :సమాచారం అందుకొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్‌.పావనమూర్తి, డిప్యూటీ డీఎంహెచ్‌వో జి.చంద్రశేఖర్‌ గురుకులాన్ని సందర్శించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. గ్రామీణ ఎస్సై ఆవుల బాలకృష్ణ చొరవతో 108, ఇతర వాహనాల్లో బాధితులను సత్తెనపల్లిలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.

సాయంత్రం 04.00 గంటలు : సత్తెనపల్లిలోని ఆసుపత్రికి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చారు. బాలికలకు అందుతున్న ఆరోగ్య సేవలను వైద్యుల ద్వారా తెలుసుకున్నారు. అనంతరం గురుకులాన్ని సందర్శించారు. అస్వస్థతతకు గల కారణాలపై సమీక్షించారు. ప్రత్యేక ఉప కలెక్టరు సారథ్యంలో కమిటీతో సంఘటనకు గల కారణాలపై విచారణ చేపట్టనున్నట్లు కలెక్టరు శివశంకర్‌ వెల్లడించారు.

రాత్రి 07.00 గంటలు :మెరుగైన వైద్యం కోసం ఇద్దరిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొంది ఆరోగ్యం మెరుగైన 93 మంది బాలికలను జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఓబులనాయుడు పర్యవేక్షణలో వారి తల్లిదండ్రులకు అప్పగించి ఇళ్లకు పంపారు. గురుకులం వద్ద తల్లిదండ్రుల ఆందోళన నేపథ్యంలో జిల్లా కలెక్టరు సూచనల మేరకు సుమారు 100 మంది బాలికలను రాత్రి 08.00 గంటల నుంచి ఇళ్లకు పంపారు.

ఇవీ చదవండి

Last Updated : Jan 31, 2023, 10:49 AM IST

ABOUT THE AUTHOR

...view details