Yuvagalam padayatra: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈనెల 27 నుంచి చేపట్టనున్న యువగళం పాదయాత్రకు ప్రభుత్వం నుంచి ఇంతవరకూ ఎలాంటి అనుమతి లభించలేదు. జనవరి 12న రాష్ట్ర డీజీపీ, హోమ్ సెక్రటరీ, చిత్తూరు ఎస్పీ, పలమనేరు, పూతలపట్టు డీఎస్పీలకు యువగళం యాత్రకు అనుమతి కోరుతూ టీడీపీ లేఖలు రాసింది. అనుమతిపై ఇప్పటివరకూ పోలీసు శాఖ నుంచి గానీ... రాష్ట్ర ప్రభుత్వం నుంచి గానీ ఎలాంటి స్పందన రాకపోవడాన్ని పార్టీ శ్రేణులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.
అనుమతి ఇచ్చినా, ఇవ్వకపోయినా యువగళం యాత్ర ఆగేది లేదని, కచ్చితంగా జరిగి తీరుతుందని తేల్చి చెప్తున్నారు. పాదయాత్రకు అనుమతులు అవసరం లేదంటూ గతంలో జగన్రెడ్డి పాదయాత్ర సమయంలో వైసీపీ చేసిన ప్రకటనలను టీడీపీ నేతలు బయట పెడుతున్నారు. జనవరి 27వ తేదీన కుప్పం నుంచి పాదయాత్ర చేపట్టనున్న లోకేశ్, 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్లు రాష్ట్రంలో పర్యటించేలా కార్యాచరణ రూపొందించుకున్నారు.
ప్రతీ నియోజకవర్గంలో 3రోజుల పాటు, ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ప్రతి జిల్లాలో నెలరోజుల పాటు పాదయాత్ర సాగనుంది. చిత్తూరు జిల్లా నుంచి అనంతపురం, కర్నూల్, కడపల మీదుగా రాయలసీమ జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసి నెల్లూరు, ప్రకాశం జిల్లాల మీదుగా కోస్తా జిల్లాల్లోకి యువగళం పాదయాత్ర ప్రవేశించనుంది. ఈ నెల 25వ తేదీన కడప వెళ్లనున్న లోకేశ్.. అక్కడ దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.