Raghu Rama Krishnam Raju: వివేకానంద రెడ్డి హత్యతో జగన్‌మోహన్ రెడ్డికి సంబంధం లేకపోతే కోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్ ఎందుకు తీసుకొచ్చారని ఎంపీ రఘురాకృష్ణరాజు ప్రశ్నించారు. వివేకానందరెడ్డి హత్య నారాసుర రక్త చరిత్రయితే.. జగన్‌మోహన్ రెడ్డి గ్యాగ్ ఆర్డర్ కోసం కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. జగన్ అండ్ కంపెనీ ఆరోపిస్తున్నట్లుగా వివేకాను హత్య చేసింది తెలుగుదేశం నాయకులు కాదని.. నిజం బయటికి వస్తే ఎన్నికల పైన తీవ్ర ప్రభావం ఉంటుందని భావించే ఈ విధంగా చేశారని రఘురామ అన్నారు.
రెండవ భార్య, కుమార్తె, అల్లుడు ఎందుకు హత్య చేయకూడదని.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవిల ద్వారా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హత్య చేయించి ఉండవచ్చని.. సజ్జల ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. ఇతరుల వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావన ఎందుకని.. వ్యక్తిత్వ హననం సిగ్గుచేటని మండిపడ్డారు. జగన్ అనుకుని ఉంటే.. వివేకా కూతురు సునీత సుప్రీంకోర్టులో కేసు వేసి ఉండేవారా అని సజ్జల ప్రశ్నించారని.. అంటే సునీతను సజ్జల బెదిరిస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.