నిబంధనలన్నీ తుంగలో తొక్కి ఇష్టానుసారం ఇసుక తవ్వకాలు Illegal Sand Transportation: ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలకు తానే సబ్‌లీజుకు అనుమతి ఇచ్చానని సీఎం జగన్ సమీప బంధువు ఆర్టీసీ ఛైర్మన్ మల్లికార్జునరెడ్డి సోదరుడు వీరారెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానించడంటే ఇసుక రీచ్‌లన్నీ అధికార పార్టీ నేతల చేతుల్లోనే ఉన్నాయనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి? ఇసుక రీచ్‌ను సబ్‌లీజుకు తీసుకున్న వ్యాపారి నారాయణరెడ్డి ఆత్మహత్యాయత్నం సందర్భంగా వీరారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు? అసలు ఇసుక తవ్వుకోవడానికి ఈ చోటా వైఎస్సార్సీపీ నేతకు ఏం అధికారం ఉంది..? సబ్‌లీజుకు ఇచ్చేందుకు ఆయనకు ఉన్న అర్హత ఏంటంటే..అధికార వైఎస్సార్సీపీ పార్టీ నేత కావడం ఒక్కటే. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి చోటామోటా నేతలు బరితెగించి నదులను ఖాళీ చేయిస్తుండగా...ఆ తోడేళ్ల గుంపునకు నాయకత్వం వహిస్తుందెవరు?
వైఎస్సార్ జిల్లాలో ఇసుక వ్యాపారం మొత్తం వీరారెడ్డికే అప్పగించారు ప్రభుత్వ పెద్దలు. రీచ్‌లవారీగా ధరలు నిర్ణయించి, తప్పుకునేందుకు ఆయనే అనుమతులిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబీకులు, అనుయాయులే ఇసుక దందాలో నిండా మునిగిపోయారు. కీలక ప్రభుత్వ పెద్దలు మొదలుకుని జిల్లా స్థాయిలో ముఖ్య నేతలు, రీచ్ స్థానిక నేతలు అంతా కలిసి తోడేళ్ల గుంపుగా తయారై ప్రకృతి ప్రసాదించిన ప్రజల సంపదను అడ్డంగా దోచేస్తున్నారు.
రాష్ట్రంలో ఇసుక వ్యాపారాన్ని జేపీ పవర్ వెంచర్స్ లిమిటెడ్ చేపట్టింది. చెన్నైలోని మైనింగ్ వ్యాపారికి చెందిన టర్న్‌కీ ఎంటర్ ప్రైజెస్ ఉప గుత్తేదారుగా రంగప్రవేశం చేసింది. గత ఏడాది జులై వరకు ఆ సంస్థే దోపిడీ పర్వం సాగించి, ప్రభుత్వ పెద్దలకు ప్రతినెలా భారీ మొత్తం చెల్లించేదనే ఆరోపణలు ఉన్నాయి. గత ఆగస్టు నుంచి పరిస్థితి మారింది. ప్రభుత్వ పెద్దలు టర్కీ స్థానంలో వైఎస్సార్సీపీ నేతలకే ఇసుక వ్యవహారాలన్నీ కట్టబెట్టేశారు. అప్పటి నుంచి ఇసుక దోపిడీ తారస్థాయికి చేరింది.
జేపీ సంస్థతో ఒప్పందం సమయంలో గనులశాఖ విధించిన నిబంధనలన్నీ బుట్టదాఖలవుతున్నాయి. ఆన్‌లైన్ బిల్లులకు బదులు ముద్రిత బిల్లులతో తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. ఇసుక లోడింగ్ కు డిజిటల్, ఆన్‌లైన్ చెల్లింపులను అనుమతించకుండా, కేవలం నగదు మాత్రమే తీసుకుంటున్నారు. ఇలా సమకూరిన నగదును ఎప్పటికప్పుడు పెద్దలకు చేర్చేలా ఏర్పాటు చేశారు. రీచ్‌లలో వేబ్రిడ్జిలు,సీసీ కెమెరాలను తొలగించారు. సరిహద్దులు తెలిపేలా జెండాలు పాతిన రీచ్లు ఒకటి, రెండు మాత్రమే ఉంటున్నాయి. ఇలా ఉల్లంఘనల జాబితా భారీగానే ఉంది.
నిబంధనల ప్రకారం నదీగర్భం నుంచి కనీసం 8 మీటర్ల ఎత్తు వరకు ఇసుక ఉన్నట్లు తేలితే గరిష్ఠంగా మూడు మీటర్ల లోతు వరకు మాత్రమే ఇసుక తవ్వకాలు చేపట్టాలి. అధికారులు సైతం 1.5 మీటర్లు, 2 మీటర్ల మేర మాత్రమే తవ్వకాలకు అనుమతులిస్తారు. కానీ ఇసుక రీచ్‌ల్లో అయిదు నుంచి ఆరు మీటర్ల లోతు వరకు ఇసుక తవ్వేస్తుండటంతో అవన్నీ చేపల చెరువులను తలపిస్తున్నాయి. పర్యావరణ అనుమతులు ఉంటేనే ఇసుక తవ్వకాలు చేపట్టాలని నిబంధనలు సూచిస్తున్నా.. రాష్ట్ర వ్యాప్తంగా అనేక రీచ్‌లకు అసలు అనుమతులే లేవు.
కేంద్ర అటవీ, పర్యావరణ, రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీలు జారీచేసిన అనుమతులు మే చివరినాటికి 80శాతం రీచ్‌ల్లో ముగిసినా...ఇప్పటికీ ఎక్కడా తవ్వకాలు ఆగలేదు. ఇసుక తవ్వకాల్లోనూ భారీ యంత్రాలను ఉపయోగించరాదని జీఎన్టీ ఇటీవల తీర్పు వెలువరించింది. సెమీ మెకనైజ్డు పేరిట ఇచ్చిన ఈసీలపైనా సమీక్షించాలని కోరింది. అయితే గనుల శాఖ అధికారులు మాత్రం సెమీ మెకనైజ్డ్ విధానంలో ఇసుక తవ్వకాలకు జీఎన్టీ అనుమతి ఉందని చెబుతుండడంతో.. రీచ్‌లు పొందిన అధికార పార్టీ నేతలు భారీ యంత్రాలను ఎడా పెడా వాడేస్తున్నారు. సెమీ మెకనైజ్డ్ అంటే ఏమిటో అధికారుల్లో స్పష్టత లేదు.
దీంతో రేవులను దక్కించుకున్న నేతలు మాత్రం పెద్ద పెద్ద జేసీబీలు, భారీ యంత్రాలను వినియోగిస్తూ ఇవి సెమీ మెక నైజ్డ్ కిందకే వస్తాయని చెబుతున్నారు. వాస్తవానికి చిన్న జేసీబీలు మాత్రమే వినియోగించాలని, పెద్ద పెద్ద యంత్రాలను నది గర్భంలోకి తీసు కెళ్లి వినియోగించకూడదని నిపుణులు చెబుతున్నారు. నదులు, వాగులు, వంకల్లోనూ ఇష్టానుసారం ఇసుక తోడేస్తుండటంతో ఏర్పడిన గుంతల్లో స్నానాలకు దిగి యువకులు ప్రాణాలు పోగొ ట్టుకున్నారు. మరో వైపు నదుల్లో ఎగువ నుంచి నీరొచ్చాక, ఎక్కడ ఎంత లోతుందో తెలియక ప్రాణాంతకంగా మారుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే గత నాలుగేళ్లలో దాదాపు 76 మంది కృష్ణా నదిలో ఇలాంటి గుంతల్లోనే పడి కన్నుమూశారు.
వైఎస్సార్ జిల్లాలో సీఎం బంధువు వీరారెడ్డి కనుసన్నల్లోనే గడువు ముగిసినా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. సిద్ధవటం, ఖాజీ పేట, చెన్నూరు, నందలూరు, ఎర్రగుంట్ల, కొండాపురం మండలాల్లోని రేవుల్లో అనుమతి లేకుండా తవ్విన ఇసుకను పెద్దఎత్తున బెంగళూరు, హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇసుక వ్యాపారం మొత్తం ఓ వైఎస్సార్సీపీ నేత ఆధ్వర్యంలోనే సాగుతోంది. అమదాలవలస, శ్రీకాకుళం, నరసన్నపేట, పాతపట్నం నియోజకవర్గాల్లో తవ్వకాలు నలుగురు కీలక నేతల కనుసన్నల్లో సాగుతున్నాయి.
అధికారిక రేవులు ఏడు ఉంటే.. కల్లిపాలెం, సింగూరు, శవ్వాళుల పేట, నివగాం, చేనులవలన, మడపాం, బుచ్చిపేట, అచ్చుతాపురం, శ్రీముఖలింగం, కళింగపట్నం, తోటాడ, దూసి, ముద్దాడపేట, తొగరాం, కళవరం రేవుల్లో అనధికారికంగా ఇసుక తవ్వేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇసుక దందా ఓ ఎమ్మెల్యే, విజయవాడకు చెందిన ఓ యువనేత భాగస్వామ్యంలో సాగుతోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో వ్యాపారాన్ని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నేత పర్యవేక్షిస్తున్నారు. కొత్తపేట నియోజకవర్గంలో భారీగా ఇసుక లభించే రేవులను అక్కడి కీలక నేత అనుయాయులే స్వయంగా నిర్వహిస్తున్నారు.