YSRCP Leader Cheated Woman VRA: ఆ మహిళ భర్త వీఆర్వోగా విధుల నిర్వహిస్తు చనిపోయాడు. భర్త మరణం తర్వాత ఆమెకు వితంతు పెన్షన్ కింద డబ్బులు వస్తున్నాయి. అయితే అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు సదరు మహిళకు వీఆర్ఏ ఉద్యోగం రావడంలో సహాయం చేశాడు. ఇక అప్పటి నుంచి ఆమెకు మాయమాటలు చెప్పి అందినకాడికి డబ్బులు లాక్కుంటున్నాడు. అతను డబ్బులు తీసుకుంటున్నాడన్న విషయాన్ని చుట్టుపక్కల వారు గమనించి ఆమెకు అర్థమయ్యేలా చెప్పడంతో మోసాపోయానని గమనించిన ఆమె.. పోలీసులను ఆశ్రయించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి తహసీల్దారు కార్యాలయంలో VRO గా పనిచేసిన చెన్నారపు సత్యనారాయణ.. సర్వీస్ లో ఉండగానే 2019లో మృతి చెందారు. ఆయన భార్య మల్లేశ్వరికి.. జగ్గయ్యపేటకు చెందిన వైసీపీ సోషల్ మీడియా సమన్వయ కర్త, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ దివ్యాంగుల అధ్యక్షుడు అయిన ఎర్రంశెట్టి ఆంజనేయులు.. VRA ఉద్యోగం రావడంలో సాయం చేశాడు. అయితే, భర్త చనిపోవడంతో ప్రభుత్వం నుంచి 10 లక్షల రూపాయలు పరిహారం వస్తే.. కేవలం లక్ష రూపాయలే వచ్చాయని ఆంజనేయులు , సదరు మహిళను నమ్మించి మిగతా సొమ్మును నొక్కేశాడు.
అంతే కాక, మల్లేశ్వరి భర్త పెన్షన్ తోపాటు ఆమె జీతాన్ని ష్యూరిటీగా పెట్టి.. బ్యాంకులో రుణం తీసుకున్నాడు. మల్లేశ్వరికి నెలకు 18 వేలు జీతం వస్తుండగా.. 6 వేలే వస్తున్నాయంటూ ATM కార్డు తీసుకుని డబ్బులు డ్రా చేసుకుంటున్నాడు. మల్లీశ్వరికి సంతానం లేకపోవడాన్ని అదునుగా చేసుకుని.. తన మేనల్లుడిని ఆమె దత్తత తీసుకున్నట్లుగా తంతు నడిపించాడు. ఆమె చనిపోయిన తర్వాత ఆ ఇంటిని తన మేనల్లుడికి దక్కేలా పత్రాలు సృష్టించాడు. ఇలా దఫదఫాలుగా 30 లక్షల రూపాయలకు పైగా మోసం చేశాడు" అని పోలీసులు తెలిపారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.