YSRCP Ignored Farmers Promise: సిరుల పంట ఇంటికి చేరిన వేళ సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకొనే రైతులు ఈసారి నిరుత్సాహంలో కూరుకుపోయారు. ఎందుకంటే ఖరీఫ్‌లో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు 31,13,477 ఎకరాలు తగ్గింది. కరవు ప్రభావం, పొడి వాతావరణం 466 మండలాల్లో ఉంటే జగన్ ప్రభుత్వం మాత్రం 103 మండలాలకే అని ప్రకటించింది. కరవుతో దెబ్బతిన్న పంటల విస్తీర్ణం సుమారు 23లక్షల ఎకరాలు అయితే ప్రభుత్వ లెక్కల్లో 14లక్షల ఎకరాలే అని తేల్చారు. అలాగే మిగ్‌జాంతో 22 జిల్లాల్లో 20లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వ మాత్రం 6.64 లక్షల ఎకరాలే అని ప్రకటించింది. ఒక్క ఏడాదే 31 లక్షల ఎకరాల్లో పంటలు వేయలేదు. సాగు చేసిన విస్తీర్ణంలోనూ 43 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటే రైతులు పండగ ఎలా చేసుకోగలరు? ఖరీఫ్‌లో సాగు చేసిందే తక్కువ. అందులోనూ 20లక్షల ఎకరాలకు పంటల బీమా చేయకుండా కత్తెరేశారు. గత నాలుగేళ్లలోనూ ఏటా వర్షాలు, వరదలు, కాదంటే కరవుతో రైతులు అప్పుల పాలయ్యారు. ఈ వాస్తవాల్ని అంగీకరించే మనసు ముఖ్యమంత్రి జగన్‌కి ఉందా? కరవు, తుపాను నష్టాలకు కోత పెట్టి అంతిమంగా 12 వందల 89 కోట్ల పెట్టుబడి రాయితీకి జాబితాలు తయారుచేశారు. పండగ నాటికి వాటిని విడుదల చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. అదీ నిలబెట్టుకోలేదు.
వైసీపీ పాలనలో పేదలు సంక్రాంతికి దూరమయ్యారు: మన్నవ మోహన కృష్ణ
వర్షాభావంతో వేరుశెనగ పోయింది. మిరప రైతులకూ తీరని దుఃఖమే మిగిలింది. ఆరంభంలో తీవ్ర వర్షాభావం, తర్వాత జెమిని వైరస్, ఇటీవల మిగ్‌జాంతో మిరప రైతులు ఎకరాకు 1.50లక్షల నుంచి 2లక్షల రూపాయలకు పైగా పెట్టుబడి కోల్పోయారు. కొన్నిరోజులుగా ధరల పతనం వెంటాడుతోంది. క్వింటాలు 20 వేల నుంచి 30వేల రూపాయల మధ్యన పలికిన మిరప ఇప్పుడు 17వేల రూపాయల దిగువకు చేరింది. పత్తి రైతుల కష్టాలూ సర్కారుకు పట్టడం లేదు. మద్దతు ధర క్వింటాలుకు 7 వేల 20 రూపాయల ఉంటే, దక్కేది సగటున 6వేల రూపాయిలే. తీవ్ర వర్షాభావంతో దిగుబడులు ఎకరానికి రెండు, మూడు క్వింటాళ్లే. ఎకరాకు 30వేలకు పైగా పెట్టుబడి పెట్టిన రైతుకు మిగిలేదేమీ లేదు. మిగ్‌జాంతో కోతకొచ్చిన వరి నేల కరిచింది. చాలాచోట్ల మొలకలొచ్చాయి. ఎలాగోలా కోయించి అమ్ముకుందామన్నా క్వింటాలుకు 4 నుంచి 6 కిలోల కోత తప్పడం లేదు. రైతును అడ్డంగా దోచేస్తున్నా తుపానుతో నష్టపోయిన అన్నదాతకు అండగా నిలిచామంటూ జగన్ సర్కారు చెప్పుకొస్తోంది.