No Funds To Rtc New Buses Purchase : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామని గొప్పలు చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికుల సదుపాయాల కల్పనను గాలికి వదిలేసింది. ఎప్పటికప్పుడు కొత్త బస్సులు కొనుగోలు చేసి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిచాల్సి ఉండగా ఆ ఊసే మరిచింది. ఎన్నో ఏళ్లుగా ప్రయాణికులకు సేవలందిస్తున్న పాత బస్సులకే.. రంగులద్ది ప్రయాణికులను తరలింస్తోంది. 15 ఏళ్ల పైన ఉన్న బస్సులను వచ్చె నెల నుంచి పక్కన పెట్టాలన్న కేంద్రం ఆదేశాలతో.. ఆర్టీసీలో పెద్ద సంఖ్యలో బస్సులు సేవల నుంచి తప్పుకొనున్నాయి.
ఈ పరిస్ధితుల్లో ఈ ఏడాదైనా బడ్జెట్లో ఆర్టీసీకి నిధులు కేటాయిస్తారని ఆశించిన ఆర్టీసీ అధికారులకు నిరుత్సాహమే ఎదురైంది. బడ్జెట్లో ఎక్కడా కొత్త బస్సుల కొనుగోలు ప్రస్తావన తీసుకురాలేదు. సంస్థలో కొత్త బస్సుల కొనుగోలు లేకపోతే.. బస్సుల కొరత తీవ్రం కానుంది. నూతన బస్సులను కొనుగోలు చేయటానికి ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయాలని ఆర్టీసీ ప్రయాణికులు, ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
పాత వాటికే రంగులేసి కొత్తగా మారుస్తున్నారు : ఎపీఎస్ఆర్టీసీలో మొత్తం 11 వేల 82 బస్సులు ఉన్నాయి. వీటిలో సంస్థ యాజామాన్యంలో ఉన్నవి 8639 బస్సులు కాగా.. మిగిలిన 2443 బస్సులను అద్దెకు తీసుకుని నడిపిస్తున్నారు. అద్దె బస్సులన్నీ ఫిట్నెస్ కలిగి మంచి కండిషన్ లోనే ఉండగా.. సంస్థకు సంబంధించిన బస్సులు మాత్రం చాలా పాత బస్సులే. 8 వేల 639 బస్సుల్లో సగానికి పైగా బస్సులు 10 లక్షల కిలోమీటర్లు పైగా తిరిగాయి. అందులో ముఖ్యంగా పల్లెవెలుగు బస్సులే ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణికుల భద్రత దృష్ట్యా 12 లక్షల కిలోమీటర్లు పైన తిరిగిన బస్సులను పక్కన పెట్టాల్సి ఉన్నా.. గత్యంతరం లేని పరిస్ధితుల్లో పాత వాటికే మరమ్మతులు చేసి పైపైన రంగులేసి కొత్త వాటిలా తీర్చిదిద్ది ఆర్టీసీ తిప్పుతోంది. పాత బస్సుల్లో ప్రయాణిస్తూ ప్రజలు అవస్తలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కండిషన్ సరిగా లేని బస్సుల చక్రాలు ఊడుతూ అదుపు తప్పుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా ఏమీ చేయలేని స్ధితిలో ఉంది.
గత్యంతరం లేక పాత బస్సులనే నడుపుతున్న ఆర్టీసీ : కొత్త బస్సుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో.. గత్యంతరం లేని పరిస్ధితుల్లో సంస్థ పాత బస్సులను నడిపిస్తోంది. దీంతో ప్రయాణికులు ఎన్నో ఏళ్లుగా తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్ధితి ఇలా ఉంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధన ప్రకారం ప్రభుత్వ రవాణా సంస్ధల్లో 15 ఏళ్లు పైబడిన వాహనాల రిజిస్ట్రేషన్ నిలిపి వేయాల్సి ఉంది. దీనివల్ల ఏప్రిల్ నుంచి ఆర్టీసీలో భారీ సంఖ్యలో బస్సులు పక్కన పెట్టాల్సిన పరిస్ధితి వచ్చింది. కేంద్రం నిబంధనల ప్రకారం మరో 15 రోజుల తర్వాత బస్సులు గణనీయంగా తగ్గిపోనున్నాయి.