YSRCP Government Negligence on Farmers :విపత్తులతో 2019 నుంచి సుమారు 20వేల కోట్లకు పైగా విలువైన పంట ఉత్పత్తుల్ని రైతులు నష్టపోయి ఉంటారని అంచనా. అయితే సర్కారు పెట్టుబడి రాయితీగా ఇచ్చింది 19 వందల 77 కోట్లు మాత్రమే. అంటే మొత్తం నష్టంలో 10 శాతం మాత్రమే. నాలుగేళ్లుగా తుపాన్లు, వరదలతో అన్నదాతలు నిండా మునుగుతున్నా, వేల కోట్లలో నష్టపోతున్నా పెట్టుబడి రాయితీ పేరుతో పదీ పరకా ఇచ్చి సరిపెడుతున్నారు. అదే ఘనమైన సాయంగా సీఎం జగన్ ప్రచారం చేసుకుంటున్నారు.
Flooded villages in AP :2019 అక్టోబరు చివరి వారంలో గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకు కురిసిన వర్షాలతో వరి, పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబరులోనూ సాధారణం కంటే 39 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. భారీగా వరి నేలకొరిగింది. సుమారు 6 లక్షల ఎకరాల్లో పత్తి దెబ్బతిన్నట్లు అంచనా. సుమారు వెయ్యి కోట్లకు పైనే నష్టం జరిగింది. ఈ వర్షాలు కౌలు రైతులను కోలుకోలేని దెబ్బ తీశాయి. 2020 ఖరీఫ్‌లో వరి రైతులు జులై, సెప్టెంబరు, అక్టోబరులో మూడుసార్లు మునిగారు. వ్యవసాయ, ఉద్యాన పంటలతో పాటు పశు, మత్స్య రంగాలకు 15 వందల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. 2020 నవంబరులో నివర్ తుపాను ప్రభావంతో 17 లక్షల 33 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమిక అంచనాలను అప్పటి వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు అసెంబ్లీలో ప్రకటించారు. మొత్తంగా 3 వేల 187 కోట్ల మేర పంట నష్టం జరిగింది.
వరి రైతు వెన్నువిరిచిన 'మిగ్‌జాం' - నిండా మునిగి దిక్కుతోచని స్థితిలో అన్నదాత
Michaung cyclone in andhra : 2021 జులైలో కురిసిన వర్షాలతో పత్తి, వరి నారుమళ్లు, నాట్లు నీట మునిగాయి. సెప్టెంబరులో గులాబ్ తుపాను ముంచేసింది. అక్టోబరు, నవంబరులోనూ భారీ వర్షాలు కురిసి 13 లక్షల 24 వేల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. పంట నష్టంతోపాటు పశు, మత్స్యరంగాలను కలిపితే 18 వందల 92 కోట్ల నష్టం జరిగిందని అంచనా. 2022 జులైలో గోదావరికి వరదలతో పరిసర జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఎగువన కురిసిన భారీ వర్షాలతో 25 లక్షల 80 వేల క్యూసెక్కుల వరద ముంచెత్తి నారుమళ్లు మునిగిపోయాయి. 2022 డిసెంబరులో మాండౌస్ తుపాను 16 జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. సుమారు 4 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిందని రైతులు చెబుతుంటే, అధికారులు మాత్రం లక్షా51 వేల ఎకరాల్లో నష్టం వాటిల్లిందని తేల్చారు.
Flooded villages in AP :2023 మార్చిలో ఈదురుగాలులు, వడగళ్ల వానలతో 22 జిల్లాల్లో పంటలపై ప్రభావం పడిందని అంచనా, ఉద్యాన రైతులకు కోలుకోలేని నష్టం జరిగింది. అరటి, మామిడి, బొప్పాయితోపాటు అక్కడక్కడా వరికి తీవ్ర నష్టం వాటిల్లింది. సుమారు 3 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, పంట నష్టం వెయ్యి కోట్లకు పైనే ఉంటుందని రైతు సంఘాల నేతలు వెల్లడించారు. ప్రభుత్వం మాత్రం 50 వేల ఎకరాల్లోపే పంట నష్టంగా గుర్తించింది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కురిసిన ఆకాల వర్షాలతో 23 జిల్లాల పరిధిలో 6 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలోని పంటలు దెబ్బతింటే రాష్ట్ర ప్రభుత్వం 54 కోట్ల పెట్టుబడి రాయితీతో సరిపెట్టింది. మే నుంచి ఆగస్టు వరకు ఆకాల వర్షాలు, వరదలతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వారికి అందించిన సాయం రూ. 11 కోట్లు మాత్రమే.
రైతులకు కన్నీటిని మిగిల్చిన తుపాను - పంట మెులకలు వచ్చే అవకాశం