Rayalaseema Irrigation Projects వ్యవసాయ పనుల్లేక రైతు కూలీలు వలస బాట పట్టాల్సి వస్తోంది. ప్రాజెక్టులను గాలికొదిలేసి కర్నూలులో ‘రాయలసీమ గర్జన’కు పిలుపునిచ్చి వైసీపీ రాజకీయం చేస్తుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయిు. ప్రాజెక్టులకు ముఖద్వారమైన కర్నూలులో కృష్ణా బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయాలన్న ఆకాంక్షను పక్కనపెట్టి విశాఖకు తరలించడమేంటని మేధావులు ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషన్ ఆర్డీఎంపీ పేరుతో ఒకేసారి 23 ప్రాజెక్టులు చేపట్టింది. నిధుల్లేకుండా ఏకంగా 33 వేల 862 కోట్ల పనులకు టెండర్లు పిలిచి ఆర్భాటంగా శంకుస్థాపనలు చేశారు. ఈ పథకం కింద ఉమ్మడి కర్నూలు జిల్లాలో 6, కడప జిల్లాలో 10, అనంతపురంలో 2, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 5 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. హంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ కాల్వలకు లైనింగ్‌తోపాటు పలు ఎత్తిపోతల పథకాలు ప్రారంభించారు. మూడేళ్లలో జరిగింది సుమారు 16 వందల 50 కోట్ల విలువైన పనులే. అందులోనూ వెయ్యి కోట్లపైగా బిల్లులు బకాయిలున్నాయి. ఆర్డీఎంపీ ప్రాజెక్టులకు నిధుల్లేక చివరకు 11 ప్రాజెక్టులను కేంద్రం ఇచ్చే పీఎంకేఎస్వై గ్రాంటు కోసం ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకు 16 వేల568 కోట్లు అవసరమని కోరినా.. ఇంత వరకు రూపాయి రాలేదు. దీంతో ‘సీమ మిషన్’ అటకెక్కింది.
పోతిరెడ్డిపాడు నుంచి 80 టీఎంసీల నీటిని తీసుకునే ఉద్దేశంతో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పడకేసింది. ఇప్పటి వరకు 13వందల కోట్ల పనులు జరిగాయి. వీటిలో 200 కోట్ల బిల్లులు మాత్రమే చెల్లించినట్లు సమాచారం. ఎన్జీటీ, తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలపడంతో పథకం మూలనపడింది. కడప జిల్లాలో బ్రహ్మంసాగర్ ఎత్తిపోతల పథకం, కుందూ నదిపై నంద్యాల జిల్లాలో జొళదరాశి, రాజోలి జలాశయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 2వేల600 కోట్లతో మూడు ప్రాజెక్టులకు 2019 డిసెంబరులో ఒకేసారి శంకుస్థాపన చేశారు. రాజోలి, జొళదరాశి పనులను 17 వందల58 కోట్లతో ఎంఆర్‌కేఆర్-రుత్విక్ జాయింట్ వెంచర్ దక్కించుకుంది. ఈ రెండు జలాశయాల నిర్మాణానికి సుమారు 8 వేల ఎకరాల భూసేకరణ చేయాలి. ప్రభుత్వం ఎకరాకు 11లక్షల 50 వేల పరిహారం నిర్ణయించగా రైతులు 30 లక్షల రూపాయల చొప్పున అడుగుతున్నారు. భూసేకరణ జాప్యంతో ఏడాదిన్నరగా ఈ రెండు ప్రాజెక్టులు నిలిచిపోయాయి. తద్వారా కుందూ నీటితో నింపాలని చేపట్టిన బ్రహ్మంసాగర్ ఎత్తిపోతలకు బ్రేక్ పడింది.
ముఖ్యమంత్రి సొంత జిల్లా గండికోటకు నీళ్లు తీసుకెళ్లే అవుకు సొరంగం పనులకు 45 కోట్ల బిల్లులు చెల్లించక నిలబెట్టేశారు. గాలేరు-నగరి ప్రాజెక్టు ప్యాకేజీ-30 కింద రెండు సొరంగాల పనులకు శ్రీకారం చుట్టారు. ఎడమ సొరంగం తెదేపా హయాంలో పూర్తయింది. వైసీపీ వచ్చాక 108 కోట్లతో చేపట్టిన 160 మీటర్ల ఫాల్ట్‌జోన్, 2.50 కిలోమీటర్ల లైనింగ్ పనులు జాప్యమవుతున్నాయి. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిన ఏడాది తర్వాత ప్రభుత్వం 787 కోట్లకు పాలనామోదం తెలిపింది.