TDP leader Nakka Ananda Babu hot comments on Minister Jogi Ramesh: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ యువనేత నారా లోకేశ్‌పై గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ మండిపడింది. సోమవారం జరిగిన బహిరంగ సభలో మంత్రి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద బాబు, గుంటూరు జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ ఘాటుగా స్పందించారు. చంద్రబాబు గురించి తప్పుగా మాట్లాడితే బడిత పూజ తప్పదని హెచ్చరించారు. అమరావతిని చంపేసి అక్కడే సిగ్గు లేకుండా బహిరంగ సభ పెట్టారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెంకటపాలెం సభలో ఊగిపోయిన మంత్రి..ముఖ్యమంత్రి జగన్.. సోమవారం రోజున సీఆర్‌డీఏ పరిధిలో పేదలకు 50,793 ఇళ్ల నిర్మాణం, 45 సామాజిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గుంటూరు జిల్లా కృష్ణాయపాలెం లేఅవుట్ వద్దకు చేరుకుని శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత వెంకటపాలెం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ మంజూరు పత్రాలను అందించారు. ఈ క్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ మాట్లాడుతూ.. ఎన్నికల సీజన్ రాగానే కొందరు రోడ్డెక్కి మాట్లాడుతున్నారని.. చంద్రబాబు నాయుడు పేదలను పీక్కుతిన్నాడంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక పవన్ కల్యాణ్ ఇప్పటికీ ఎన్నో పార్టీలు మార్చాడన్న మంత్రి.. భార్యల్నీ, పార్టీల్నీ మార్చటం వెన్నతో పెట్టిన విద్యంటూ వ్యాఖ్యానించారు. 'ఇంకొకడు' జగనన్నతో పోటీ అంటూ నడుస్తున్నాడని పరోక్షంగా నారా లోకేశ్‌పై పలు రకాల వ్యాఖ్యలు చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు వద్దు అని కోర్టుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు అంటూ మంత్రి విమర్శించారు.
చంద్రబాబు గురించి తప్పుగా మాట్లాడితే..బడిత పూజ తప్పదు.. వెంకటపాలెం బహిరంగ సభలో మంత్రి జోగి రమేశ్ బూతులు తిడుతుంటే.. ముఖ్యమంత్రి జగన్నవ్వడం ద్వారా.. మిగిలిన నేతలనూ కూడా బూతులు తిట్టమని ప్రోత్సహించనట్టేనని.. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు గురించి తప్పుగా మాట్లాడితే.. బడిత పూజ తప్పదని హెచ్చరించారు. బూతులు మాట్లాడినందుకు గుంపేసుకుని చంద్రబాబు ఇంటి మీదకొచ్చినందుకే.. జోగి రమేశ్‌కు ఆ పదవి ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. దళిత సంక్షేమంపై మంత్రులు ఆదిమూలపు, మేరుగ నాగార్జున చర్చకు వస్తారా..? అని సవాల్ చేశారు. అమరావతి అభివృద్ధి కంటే విధ్వంసం చేయడానికే జగన్ ఎక్కువ ఖర్చు చేశారని దుయ్యబట్టారు. అమరావతి చంపేసి అక్కడే సిగ్గు లేకుండా బహిరంగ సభ పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలను మోసం చేసి, అమరావతిలో 50 వేల ఇళ్లు కట్టించే బదులు.. పోలవరం నిర్వాసితులకు ఇళ్లు కట్టిస్తే పోలవరం పూర్తి అయ్యేదని హితవు పలికారు. కోట్లాను కోట్లు దోచుకున్న పందికొక్కులు.. జగన్ ప్రభుత్వంలో చాలా మందే ఉన్నారని ఆనంద బాబు విమర్శించారు.
సీఎం జగన్ మాటలన్నీ పచ్చి అబద్ధాలు.. అమరావతిలో పేదల ఇళ్ల నిర్మాణ సభలో ముఖ్యమంత్రి అన్నీ అసత్యాలు మాట్లాడారని.. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ ఆరోపించారు. కోర్టుల్లో గెలిచామని సీఎం స్థాయి వ్యక్తి అబద్దాలు చెప్పటం విస్మయం కలిగించిందన్నారు. ఇళ్ల పట్టాలు తుది తీర్పునకు లోబడే ఉంటాయని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని మరిచారా జగన్..? అని ప్రశ్నించారు. ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణం అంశంపై హైకోర్టులో తీర్పు రిజర్వులో ఉన్నది వాస్తవం కాదా..? అని నిలదీశారు. రాజకీయ లబ్ది కోసం ముఖ్యమంత్రి ఇంత నీచమైన ఆలోచనలు చేస్తారా..? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
జోగి రమేశ్‌కు.. జంతువు లక్షణాలు పట్టాయి..రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలపై ముఖ్యమంత్రి జగన్‌కు నిజంగా ప్రేమ ఉంటే ఇడుపులపాయ ఎస్టేట్లో భూముల్ని పేదలకు ఎందుకు పట్టాలుగా పంచటం లేదో చెప్పాలని..టీడీపీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ ప్రశ్నించారు. బహిరంగ సభలో వణుకుతూ మాట్లాడిన మంత్రి జోగి రమేశ్ కు.. జంతువు లక్షణాలు పట్టాయని, అందుకే అతుడు పశువుల భాష ఉచ్ఛరించాడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి జోగి రమేశ్‌కు గృహ నిర్మాణ శాఖపై ఏ మాత్రం పట్టులేదని.. తెనాలి శ్రావణ్ కుమార్ విరుచుకుపడ్డారు.