TIDCO beneficiaries fire on YSRCP government: ''రాష్ట్రంలో జగనన్న సర్కార్ నిర్మిస్తోంది జగనన్న కాలనీలు కాదు.. ఏకంగా ఊర్లు కడుతున్నాం. అధికారంలోకి వచ్చాక ఉచితంగా టిడ్కో ఇళ్లు కట్టిస్తామని ఆనాడూ హామీ ఇచ్చాం.. ఈరోజు నెరవేర్చాం. ప్రతీ లబ్ధిదారునికి రూ.7 లక్షల ఆస్తిని ఉచితంగా ఇచ్చాం. అక్కాచెల్లెమ్మల చేతిలో రూ.6 నుంచి 15 లక్షల ఆస్తిని పెట్టాం. పేదలకు 300 అడుగుల టిడ్కో ఇళ్లను ఉచితంగా ఒక్క రూపాయికే ఇచ్చాం. 257 ఎకరాల స్థలం సేకరించి.. ఒక పక్క టిడ్కో ఇళ్లు, మరోపక్క ఇళ్ల స్థలాలిచ్చి నిర్మాణం చేస్తున్నాం. వీటన్నింటి మధ్య ఈరోజు నాకు కొత్త గుడివాడ నగరం కనిపిస్తోంది'' అంటూ సరిగ్గా వారం రోజులక్రితం ముఖ్యమంత్రి జగన్.. కృష్ణా జిల్లా గుడివాడ బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై నేడు గుడివాడ టిడ్కో గృహాల నివాసులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్‌కు మాటలు ఎక్కువ-చేతలు తక్కువ అంటూ విమర్శిస్తున్నారు.
తాళాలివ్వండి మహోప్రభో..కృష్ణా జిల్లా గుడివాడలో టిడ్కో గృహాల సముదాయాన్ని సీఎం జగన్ ప్రారంభించి.. వారం గడుస్తున్నా ఫ్లాట్ల తాళాలు మాత్రం ఇంకా లబ్ధిదారులకు అందలేదు. సాక్షాత్తూ సీఎం ఎంతో అట్టహాసంగా ప్రారంభించి.. గృహ ప్రవేశాలు చేసిన ఇళ్లకు కూడా వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి. ప్లాట్లను ఎప్పుడు అప్పగిస్తారో తెలియక లబ్ధిదారులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఎంతో గొప్పగా తమ ఇళ్లను బంధువులకు చూపించేందుకు వచ్చిన లబ్ధిదారులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. అన్ని వసతులతో అట్టహాసంగా ఇళ్లు ఇస్తున్నాం అని.. సీఎం చెప్పినప్పటికీ క్షేత్రస్థాయి పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయంటూ ఆవేదన చెందుతున్నారు.