YS Jagan Own Party Candidates Leaving YSRCP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయం ఆసన్నమైన తరుణంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో, ప్రజల్లో, ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇన్నాళ్లూ ఎమ్మెల్యేలుగా, పార్టీ సమన్వయకర్తలుగా పని చేసిన జగన్ మోహన్ రెడ్డి సొంత సామాజికవర్గం అభ్యర్థులు ఒక్కొక్కరుగా వైసీపీని వీడుతుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి నుంచి పార్టీని, వైఎస్ జగన్నీ నమ్ముకున్నోళ్లను ఆయన నట్టేట ముంచాడా? ఒక్కరోజులోనే సుమారు 11 నియోజకవర్గాల సమన్వయకర్తలను మార్చటం వెనకున్న కథేంటి? వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోబోతుంది అని జగన్‌కు ఇప్పటి నుంచే భయపట్టుకుందా? అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
YSR Congress Party Updates:వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీని (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ) స్థాపించిన రోజు నుంచి ఇప్పటిదాకా అతని వెంట నడిచిన సొంత సామాజికవర్గం అభ్యర్థులు పార్టీకి రాజీనామాలు చేస్తుండడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇన్నాళ్లపాటు పార్టీలో అగ్రతాంబూలం ఇచ్చి, అందలం ఎక్కించిన జగన్, తన సొంత సామాజికవర్గం వారు నిరసన గళాలు విప్పుతుండడం ఆ పార్టీ శ్రేణుల్లో అలజడి రేపుతోంది. తాజాగా పార్టీ పెద్దలు 11 నియోజకవర్గాల సమన్వయకర్తలను మార్చటంపై ఆ పార్టీ అసంతృప్తులు భగ్గుమంటున్నారు.
వైసీపీ ఇంచార్జ్‌లు నియామకం - మార్పుల వెనుక డబ్బు-లాబీయింగ్ గట్టిగా పని చేసిందని ప్రచారం
CM Jagan 823 Posts Appointed Own Community Members: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి, అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి వైఎస్ జగన్ సలహాదారులు, ఇతర నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ ఛైర్మన్‌లు, డైరెక్టర్లు, ఆఖరికి విశ్వవిద్యాలయాల వీసీలుగా సొంత సామాజిక వర్గానికే కట్టబెడుతూ వస్తున్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు అనేకమార్లు ఆరోపణలు చేసినా పట్టించుకోకుండా ముందుకు సాగారు. సీఎం హోదాలో వైఎస్ జగన్ ఇప్పటివరకూ దాదాపు 823 పదవులను ఒకే సామాజికవర్గానికి కట్టబెట్టారంటే వారికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఇట్టే అర్ధమైపోతుంది.
Key MLAs left YSRCP: అయితే, ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ కీలక నేతలు వైసీపీని ఒక్కొక్కరుగా వీడుతున్నారు. మొదటగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గాజువాక నుంచి వైసీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డిలు పార్టీని వీడారు.
MLA Kotamreddy Sridhar Reddy: నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యేకోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తొలుత వైసీపీపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఆయనకు (కోటంరెడ్డికి) మంత్రి పదవి ఇవ్వకపోవడంతోపాటు తన కంటే వెనక పార్టీలోకి వచ్చిన కాకాణికి మంత్రి పదవి ఇవ్వడంతో కోటంరెడ్డి అవమానంగా భావించారు. వైఎస్ కుటుంబానికి ఎంతో సన్నిహితంగా ఉండే కోటంరెడ్డి, జగన్ కష్టనష్టాల్లోనూ వెన్నుదన్నుగా నిలిచారు. అలాంటి కోటంరెడ్డిని పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయనకు ప్రాధాన్యం కల్పించకపోవడంలోనూ, నియోజకవర్గం అభివృద్ధికి నిధులు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేశారు. దాంతో తీవ్ర అవమానంగా భావించిన కోటంరెడ్డి వైసీపీ పార్టీని వీడారు.