ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో గంజాయి ఫుల్..చర్యలు నిల్ - ముఖ్యమంత్రి నివాసం సమీపంలో యువతిని దారుణ హత్య

GANJAI : గుంటూరులో గంజాయి మత్తులో ఇద్దరు యువకులు చేసిన అరాచకం చూస్తే గంజాయి మత్తులో యువత ఎంతటి తీవ్ర నేరాలకు తెగబడుతున్నారో అర్థమవుతుంది. కొన్ని రోజుల క్రితం తాడేపల్లిలో ముఖ్యమంత్రి నివాసం సమీపంలో యువతిని దారుణ హత్య చేసిన నిందితుడు సైతం గంజాయి సేవించే దాడి చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. గంజాయి మత్తులో నేరాలకు పాల్పడుతున్నా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గుంటూరులో గంజాయి
గుంటూరులో గంజాయి

By

Published : Mar 3, 2023, 12:42 PM IST

రాష్ట్రంలో గంజాయి ఫుల్..చర్యలు నిల్

GANJAI : రాష్ట్రంలో గంజాయి మత్తులో యువకులు దారుణాలకు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గుంటూరులో గంజాయి మత్తులో ఇద్దరు యువకులు చేసిన అరాచకం చూస్తే గంజాయి మత్తులో యువత ఎంతటి తీవ్ర నేరాలకు తెగబడుతున్నారో అర్థమవుతుంది. హత్యలు, అరాచకాలకు పాల్పడుతున్నా పోలీసులు ఏం చేస్తున్నారని, రాత్రి గస్తీ ఏమైందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం తాడేపల్లిలో ముఖ్యమంత్రి నివాసం సమీపంలో యువతిని దారుణ హత్య చేసిన నిందితుడు సైతం గంజాయి సేవించే దాడి చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. గంజాయి మత్తులో నేరాలకు పాల్పడున్నా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాష్ట్రంలో గంజాయి రవాణా అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది. ఎక్కడో మారుమూల ప్రాంతంలో దొరికే గంజాయి ఇప్పుడు వీధి చివరలో ఉండే బడ్డీ కొట్టు, పాఠశాల గ్రౌండ్‌లలోకి సులభంగా చేరిపోతోంది. పోలీసుల నిఘా కొరవడంతో ఎక్కడంటే అక్కడ లభ్యమవుతోంది. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు సీఎం నివాసం ఉండే తాడేపల్లిలోనూ పెద్దఎత్తున యువత గంజాయి మత్తులో జోగుతున్నారు. సీఎం నివాసానికి అతి సమీపంలోనే గంజాయి బ్యాచ్ ఆగడాలు శృతిమించుతున్నాయని వారివల్ల నిద్రాహారాలు ఉండటం లేదని లంబాడీపేట మహిళలు తాడేపల్లి పోలీసుస్టేషన్‌లో జనవరి 31న ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో కొద్దిరోజులకే ఫిబ్రవరి 13న సీఎం నివాస ప్రాంతంలోనే ఎస్సీ బాలికపై కుక్కలరాజు గంజాయి మత్తులోనే దాడి చేసి నరికి చంపేశాడు. గంజాయి బ్యాచ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. పైగా ఫిర్యాదు చేశామని తెలిస్తే తమపైనా దాడులకు తెగబడుతున్నారన్నారు.

విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రాజమహేం ద్రవరం, తిరుపతి సహా అనేక నగరాల్లో గంజాయి సేవించే బ్యాచ్‌లు పెరుగుతున్నాయి. కొన్నిచోట్ల రౌడీషీటర్లే వీరిని పెంచి పోషిస్తున్నారు. వారితో నేరాలు చేయించడమే గాక, వీరినే గంజాయి సరఫరాదారులుగానూ మార్చేస్తున్నారు. వారెవరో పోలీసులకు తెలిసినా చర్య లేవన్న విమర్శలున్నాయి. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై మాత్రం గంజాయి కేసులు నమోదు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

గంజాయి సేవిస్తూ కళాశాల విద్యార్థులు దొరికిపోవడంతో విజయవాడ చుట్టుపక్కల 12 కళాశాల ప్రిన్సిపాళ్లకు రెండేళ్ల క్రితమే పోలీసులు లేఖల ద్వారా హెచ్చరించారు. మీ కళాశాలల్లో ఇలాంటి వారు ఇంకా చాలామంది ఉండొచ్చని..తరచూ వసతి గృహాల్లో తనిఖీలు చేయాలని సూచించారు. కళాశాలలకు ఎక్కువగా గైహాజరవుతున్న విద్యార్థులు, బ్యాక్ ల్యాగ్స్ ఉన్నవారి జాబితాను గుర్తించాలన్నారు. వారాంతాల్లో విద్యార్థులు ఎక్కడికి వెళ్తున్నారనే విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని హెచ్చరించారు. గంజాయి ముఠాలు తొలుత విద్యార్థులను మత్తుకు అలవాటు చేస్తున్నాయి. తర్వాత ఈ విష వలయంలో చిక్కుకునేలా చేస్తున్నాయి. వారిని అడ్డం పెట్టుకుని వారితోనే కళాశాలల్లో అమ్మకాలు సాగిస్తున్నాయి. అందుకే పట్టుబడుతున్న వారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉంటున్నారు. గంజాయి సరఫరా చేసే విద్యార్థులకు ముందుగా 20 నుంచి 30 శాతం కమిషన్‌ ఇవ్వడంతో జల్సాలకు అలవాటుపడిన వారు ఆ తర్వాత నేరాలకు పాల్పడుతున్నారు.

2021 లో రాష్ట్రంలో పట్టుకున్నంత గంజాయి మరే రాష్ట్రంలోనూ దొరకలేదని నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో తెలిపింది. దేశవ్యాప్తంగా 7 లక్షల49 వేల కిలోల గంజాయి స్వాధీనమైతే..మన రాష్ట్రంలోనే 2 లక్షల కిలోలు పట్టుబడింది. విశాఖపట్నం మన్యంలో గంజాయి సాగును మొత్తం ధ్వంసం చేసి, నిర్మూలించామని పోలీసులు ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయి పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఒడిశాలోని మల్కన్‌గిరి వైపు నుంచీ రాష్ట్రంలోకి గంజాయి సరఫరా అవుతోంది. దీన్ని పోలీసులు కట్టడి చేయలేకపోతున్నారు. పట్టణాలు, నగరాల్లో గంజాయి బ్యాచ్‌లుగా మారి అక్రమాలకు, నేరాలకు పాల్పడుతున్న వారిని అణచివేయలేకపోతున్నారు. ఫలితంగా ఈ మత్తులో నేరాల తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details