Young Boy Selected for Nasa Space Program: చిన్నప్పటి నుంచే శాస్త్ర సాంకేతిక రంగంలో రాణించాలన్న కోరిక బలంగా పెట్టకున్నాడు.. ఆ ఆసక్తికి తల్లిదండ్రుల ప్రోత్సాహం తోడయ్యింది. అలా చదువుకుంటూనే అంతరిక్షంలో నాసా చేసిన ప్రయోగాల గురించి అధ్యయనం మెుదలు పెట్టాడు. ఫలితంగా ఇతడి ప్రతిభను గుర్తించిన నాసా.. ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్-2023కు ఎంపిక చేసింది. విజయవాడకు చెందిన ఆ యువకుడి పేరు చార్లెస్ జాన్. అతడి తండ్రి చర్చిలో ఫాదర్. చిన్నప్పటి నుంచి ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూ.. చదువుల్లో చక్కగా రాణించేవాడు. పాఠశాలలో ఉపాధ్యాయుడు చెప్పే పాఠంలో ఏ సందేహం వచ్చినా నివృత్తి చేసుకుంటూ ముందుకు సాగాడు. దీంతో పాటు కొత్త కొత్త పుస్తకాలు చదివి.. తెలియని అనేక విషయాలు తెలుసుకున్నాడు.
ప్రోత్సహించిన తల్లిదండ్రులు... 11 ఏళ్లకే శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించాలనే పెద్ద లక్ష్యం పెట్టుకున్నాడు జాన్. ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు అన్ని విధాలా ప్రోత్సహించారు. పైగా తనకు కావాల్సిన పుస్తకాలను తండ్రి సహాయంతో తెప్పించుకునేవాడు. ఇలా క్రమేపి తన ఆలోచనలు నాసా వైపు ఉండేలా ప్రయత్నాలు చేశాడు. అందుకే సామాజిక మాధ్యమాల్లో అంతరిక్షానికి సంబంధించిన అంశాలపై ఎక్కువగా శోధన చేసేవాడనని అంటున్నాడు ఈ యువకుడు. అంతరిక్షమే లక్ష్యంగా కావాల్సిన పరిజ్ఞానం పెంపొందించుకుంటున్నాడు జాన్. అదే సమయంలో ఆన్‌లైన్ ద్వారా నాసా నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు ఈ యువకుడు. ఆ ఇంటర్వ్యూల్లో అగిడిన ప్రశ్నలకు సమాధానం చెప్పి.. శాస్త్రవేత్తలను మెప్పించాడు. ఫలితంగా అమెరికాలోని అలబమాలో నాసా నిర్వహించే ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్-2023కు ఎంపికయ్యాడు ఈ ప్రతిభవంతుడు. నాసా ఆధ్వర్యంలో పని చేస్తున్న ఎక్సా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి ఇద్దరు ఎంపిక కాగా.. వారిలో ఛార్లెస్ జాన్ కూడా ఉన్నాడు. ఎంపికైన వారికి సుమారు వారం రోజుల పాటు వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రధానంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, రాకెట్ పని విధానం, తయారీ, రోబోటిక్స్ గురించి నాసా అధికారులు వివరించనున్నారు.