MLA VASANTHA KRISHNA PRASAD : పది మంది రౌడీలను వెంటేసుకుని తిరగడం చేతగాక తాను పాతతరం నాయకుడిగానే మిగిలిపోయానని ఎన్టీఆర్ జిల్లా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు. మైలవరం మండలం చంద్రాల సొసైటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఆయన పార్టీలో పరిణామాలపై అసంతృప్తిని వెళ్లగక్కారు. తాను పుట్టినప్పటి నుంచి తన తండ్రి రాజకీయాల్లోనే ఉన్నారని.. 55 ఏళ్లుగా తమ కుటుంబం రాజకీయం చేస్తోందని చెప్పారు. అప్పటితో పోల్చితే ప్రస్తుత రాజకీయాలు గణనీయంగా మార్పు చెందాయని వివరించారు.
"నేను ఉన్నత కుటుంబం నుంచి వచ్చానని.. మొదటి నుంచి రాజకీయ నేపథ్యం నుంచి వచ్చానని చాలా మంది ఉన్నారు. నిజమే మా కుటుంబం గత 50 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు.. కానీ అప్పటి రాజకీయాల్లో, ఇప్పటి రాజకీయాల్లో చాలా గణనీయమైన మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఉన్న రాజకీయాల్లో పది మంది పోరంబోకులను వెంట వేసుకుంటేనే రాజకీయాల్లో ముందు అడుగు వేసే పరిస్థితి ఉంది. అందుకే నేను ఇంకా పాతతరం నాయకుడిగానే ఉన్నాను"-వసంత కృష్ణప్రసాద్, మైలవరం ఎమ్మెల్యే