ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Chandrababu on Jagan: ఎన్నికలు ఎంత తొందరగా వస్తే.. జగన్ అంత త్వరగా ఇంటికే: చంద్రబాబు - ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి

Chandrababu on Jagan: రాష్ట్రంలో అసమర్థ పాలన సాగుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జోరుగా భూకబ్జాలు, బెట్టింగులు సాగుతున్నాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Chandrababu
చంద్రబాబు

By

Published : Jul 7, 2023, 9:16 PM IST

Chandrababu on Jagan: రాష్ట్రంలో అసమర్థ పాలన సాగుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. దిల్లీ వెళ్లి జగన్మోహన రెడ్డి ఏం సాధించారని నిలదీశారు. ముందస్తు ఎన్నికలంటూ వాళ్లే లీకులిచ్చి, సాయంత్రానికి వాళ్లే ఖండిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో.. చంద్రబాబు సమక్షంలో ప్రొద్దుటూరు వైసీపీ నుంచి పెద్ద ఎత్తున శ్రేణులు తరలివచ్చి తెలుగుదేశంలో చేరారు. ప్రొద్దుటూరు వైసీపీ ముస్లిం నేత మహమ్మద్ గౌస్, కార్యకర్తలు పసుపు కండువా కప్పుకున్నారు. అదే విధంగా పాణ్యం సావిత్రమ్మ, రవీంద్ర, వారి అనుచరులు కూడా టీడీపీలో చేరారు.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉన్నాం.. పులివెందులలో జగన్ పని గోవిందా..

ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధం:ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం పార్టీ సిద్ధమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎంత త్వరగా ఎన్నికలు వస్తే జగన్ అంత త్వరగా ఇంటికి పోతాడని దుయ్యబట్టారు. ఎన్నికలు ఎంత తొందరగా వస్తే రాష్ట్రానికి పట్టిన శని అంత త్వరగా పోతుందని మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి వల్ల అధికారులు, ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరులో లోకేశ్ పాదయాత్రపై కోడిగుడ్డు వేస్తే భయపడతాడనుకున్నారా అన్న చంద్రబాబు.. బాంబులకే భయపడని కుటుంబం తమదని తెలిపారు.

ధరలను నియత్రించాం: పేదలపై 51 వేల కోట్ల రూపాయల మేర విద్యుత్ భారం వేశారనీ.. టీడీపీ ప్రభుత్వం రాగానే కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. టమాట ధర 200 రూపాయలకు చేరిందని.. నిత్యావసర ధరలు పెరిగాయన్నారు. టీడీపీ హయాంలో ధరలు పెరిగితే నియంత్రించామని తెలిపారు. ఉల్లిపాయ ధరలు పెరిగితే నాసిక్ నుంచి ఉల్లిపాయలు తెప్పించి ధరలను నియంత్రించామన్నారు.

అమూల్​కి కట్టబెట్టారు: ప్రొద్దుటూరు డెయిరీని ఎందుకు తెరవలేదని నిలదీశారు. చిత్తూరు డెయిరీ ఆస్తులను అమూల్​కు ఇచ్చేశారనీ.. 6 వేల కోట్ల మేర ఏపీ రైతుల ఆస్తులను గుజరాత్ రాష్ట్రానికి చెందిన అమూల్​కు కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ డెయిరీలకు ఏపీలోని జిల్లాలను పంచి పెట్టారని వాపోయారు. కర్ణాటకలో అమూల్ డెయిరీని అంగీకరించలేదని.. తెలంగాణలో విజయ డెయిరీని అభివృద్ధి చేస్తున్నారని గుర్తు చేశారు. అమూల్ డెయిరీకి ఎన్ని ఆస్తులు కట్టబెట్టారో లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రొద్దుటూరు ఎమ్మెల్యేపై విమర్శలు: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి భూ బకాసురుడన్న చంద్రబాబు.. చేసిన తప్పులను ప్రశ్నించినందుకు నందం సుబ్బయ్య అనే టీడీపీ కార్యకర్తను చంపేశాడని మండిపడ్డారు. గుట్కాల అమ్మకం.. తోపుడు బళ్ల దగ్గర కూడా మామూళ్లు వసూలు చేయడం ఎమ్మెల్యే రాచమల్లుకు అలవాటుని దుయ్యబట్టారు. ఒకప్పుడు మామూలు కౌన్సిలర్​గా కూడా గెలవలేని వ్యక్తి.. ఇప్పుడు ప్రొద్దుటూరును మింగేసే స్థాయిలో ఉన్నాడని ఎద్దేవా చేశారు.

ఎస్సీ, ఎస్టీ అసెంబ్లీ స్థానాలు కైవసం దిశగా వ్యూహరచన:రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోందని భావిస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. అందుకు తగ్గట్టుగా ఇన్​చార్జుల ఎంపికను వేగవంతం చేశారు. ప్రతీ నియోజకవర్గ ఇన్​చార్జ్​ పనితీరును లోతుగా విశ్లేషిస్తూ ఏకాభిప్రాయం తీసుకొచ్చే దిశగా కసరత్తు ముమ్మరం చేశారు. తొలుత ఎస్సీ, ఎస్టీ స్థానాలపై దృష్టి సారించిన అధినేత.. విభేదాలను పక్కనపెట్టి పార్టీ కోసం పని చేయాలని నేతలకు తేల్చి చెబుతున్నారు. మొత్తం 36 ఎస్సీ, ఎస్టీ అసెంబ్లీ స్థానాల్లో ఈసారి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా వ్యూహరచన చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details