ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Gubbalagutta Exploitation: అధికార పార్టీ నేతల చేయి కలిస్తే.. గుట్టలు గుల్లే - గుబ్బలగుట్టలో అనధికార తవ్వకాలు

YCP leader Husband Exploit Gubbalagutta: రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు.. కొండలు మాయమవుతున్నాయి.. నదుల్లో ఇసుక తరలిపోతోంది. అయినా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఎవరైనా ఎదిరిస్తే బెదిరింపులే.. ఇలాంటి ఘటనలు కోకొల్లలు. ఇలాంటి ఘటనే విజయవాడ సమీపంలో జరిగింది. నగర దగ్గరలో ఉన్న గుబ్బలగుట్టను గుల్ల చేస్తున్నారు. కొండను తొలచగా వచ్చిన కొన్ని లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ను అక్రమంగా విక్రయిస్తున్నారు. ఇదంతా చేసిన కాంట్రాక్టర్​ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధికి భర్త కావడమే. తనకు కలెక్టర్‌ అనుమతి ఇచ్చారని ఆ గుత్తేదారు ప్రచారం చేస్తునట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

గుబ్బలగుట్టలో అనధికార తవ్వకాలు
Vijayawada GubbalaGutta Exploitation

By

Published : Jul 25, 2023, 10:07 PM IST

Vijayawada GubbalaGutta Exploitation: ప్రభుత్వ యంత్రాంగం, అధికార పార్టీ నేతలు చేయిచేయి కలిపితే.. ఎలాంటి కొండలనైనా.. గుల్ల చేయవచ్చనడానికి నిదర్శనంగా మారింది విజయవాడ సమీపంలో ఉన్న గుబ్బలగుట్ట. తనకు అధికారుల అనుమతులు ఉన్నాయని ఏకంగా కొండను బాంబులు పెట్టి పిండి చేశారు. కొన్ని లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి అక్కడ నుంచి అక్రమంగా తరలించారు. గ్రావెల్‌ మాత్రమే కాదు.. ఈ గుబ్బలగుట్ట పేలుళ్లలో పునాది రాయి కూడా వచ్చింది. దీనిని కూడా విక్రయించారు. ఇదంతా చేసిన కాంట్రాక్టర్​ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధికి భర్త కావడం ఇక్కడ విశేషంగా మారింది. తనకు కలెక్టర్‌ అనుమతి ఇచ్చారని ఆ గుత్తేదారు ప్రచారం చేస్తునట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

విజయవాడ గ్రామీణ మండలం పాతపాడు సమీపంలో ఈ గుబ్బలగుట్ట ఉంది. దీనిలో కొంత అటవీ శాఖ భూమి కూడా ఉందని స్థానికులు తెలిపారు. రెవెన్యూ రికార్డులో మాత్రం ఈ గుబ్బలగుట్ట కొండ పోరంబోకు స్థలంగా ఉంది. విజయవాడ మధ్య నియోజకవర్గంలో జగనన్న కాలనీలు పేరు మీద ఇళ్లులేని పేదలకు గృహాలను కేటాయించారు. ఇప్పటికే పల్లవానితిప్ప, సూరంపల్లి, కొండపావులూరు, వెదురుపావులూరులో లబ్బిదారులకు ఇళ్లను ఇవ్వగా ఇవన్నీ గన్నవరం పరిధిలోనే ఉన్నాయి. మిగిలిన వారికి నగరానికి సమీపంలో ఇవ్వాలని ఒత్తిడి పెరిగడంతో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే సూచన మేరకు పాతపాడు సమీపంలో ఉన్న గుబ్బలగుట్ట ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఈ ప్రాంతం కూడా గన్నవరం పరిధిలోకే వస్తుంది. జగనన్న కాలనీల కోసం పట్టాభూమి కొనే పరిస్థితి లేకపోవడంతో కొండ పోరంబోకుగా ఉన్న గుబ్బలగుట్ట ప్రాంతాన్ని అధికారులు ప్రతిపాదించారు. ఇందులో భాగంగా దాదాపు 575 మంది లబ్ధిదారులకు 20 ఎకరాల ప్రాంతం కావాల్సి వచ్చింది. కానీ అక్కడ చదును మైదాన ప్రాంతం లేదు. దీంతో కొండను తొలిచి స్థలాలు కేటాయించాలని నిర్ణయించారు.

గత ఆరునెలలుగా ఇక్కడ తవ్వకాలు జరపగా వచ్చిన మట్టిని తరలించారు. ఈ సందర్భంగా వారు బాంబులను వినియోగించి పేలుళ్లు కూడా జరిపారు. ఇలా వెలువడిన కొన్ని లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌, రాయిని పెద్దఎత్తున విక్రయించారు. కానీ అధికారులు మాత్రం అవి జగనన్న లేఔట్ల చదునుకు తీసుకువెళ్లినట్లు చెబుతున్నారు. ఆ సమీపంలోనే కొండపావులూరు, వెదురుపావులూరు లేఔట్‌లు ఉన్నాయి. ఆ ప్రాంతంలో కూడా కొన్ని లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ అందుబాటులో ఉంది. ఆ గ్రావెల్​ను కాదని ఇంత దూరం నుంచి అక్కడికి తరలించే అవకాశం లేదు. అక్కడ కూడా ఇలానే కొండలను పిండిపిండి చేస్తూ ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గుబ్బలగుట్టలో కొండను తొలిచి వేసిన లేఔట్‌ను ఇళ్లకు కేటాయించగా.. అక్కడ నిర్మాణానికి లబ్ధిదారులు మాత్రం ఆసక్తి చూపడం లేదు.

ఏ ప్రభుత్వ కార్యకలాపానికి అయినా గనుల శాఖ అనుమతి తీసుకొని సీనరేజీ చెల్లింపులు చేయాల్సిందే. జగనన్న కాలనీల కోసమే అయినా కూడా పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందే. అలాంటివి ఏమీ లేకుండా కలెక్టర్‌ అనుమతి ఇచ్చారని గుబ్బలగుట్టను తవ్వడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. అలాగే ఈ ప్రాంతం నుంచి ఒక్క లారీ గ్రావెల్‌ కూడా జగనన్న కాలనీలకు పోలేదు. కానీ కొండచుట్టూ తొలిచారు. ఇదంతా ఎక్కడికి వెళ్లిందని ఉన్నతాధికారులు ఆరా తీయలేదు. దీనిపై గనుల శాఖ ఎలాంటి అనుమతి ఇవ్వలేదని ఓ అధికారి ధ్రువీకరించారు.

ఒక క్యూబిక్‌ మీటరుకు దాదాపు రూ.101 వరకు రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఆప్రకారం చూస్తే రూ.కోట్లలో గండి కొట్టారు. ఆ గుత్తేదారు జగనన్న కాలనీల్లో ఇళ్లను ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కాకుండా లబ్ధిదారుల నుంచి రూ.25-75 వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. గుబ్బలగుట్టను తొలచడంపై కొందరు జాతీయ హరిత ట్రైబ్యునల్‌కి ఫిర్యాదు చేశారు. దీనిపై విజయవాడ గ్రామీణ తహసీల్దారు జాహ్నవిని వివరణ కోరగా కలెక్టర్‌ ఆదేశాల మేరకు కొండను చదును చేసి లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details