Flexi Politics In AP : రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ, జనసేన మధ్య ఫ్లెక్సీ వార్ సాగుతోంది. విజయవాడలో వైఎస్సార్సీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించని జీవీఎస్సీ అధికారులు.. తాము ఏర్పాటు చేసిన బ్యానర్లను ఎందుకు తొలగిస్తున్నారని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలు తీసేశాకే తమ జోలికి రావాలని, లేదంటే రెండు పార్టీలకు అనుమతించాలని మహేశ్ డిమాండ్ చేశారు.
వైకాపా బ్యానర్ల జోలికిపోని అధికారులు.. జనసేన నాయకులు ఏర్పాటు చేసిన బ్యానర్లను గంటల వ్యవధిలోనే తొలగించటం దుర్మార్గం. కక్షపూరితంగా తమ ఫ్లెక్సీలను తొలగిస్తే పెద్దయెత్తున ఆందోళన చేపడతాం. తమ సహనాన్ని పరీక్షించాలని చూస్తే ఊరుకునేది లేదు. -పోతిన మహేష్, జనసేన అధికార ప్రతినిధి
సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు :పవన్ కల్యాణ్‌ను కించపరిచేలా వైకాపా నేతలు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారంటూ అనకాపల్లి జీవీఎమ్సీ కార్యాలయం ఎదుట జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రాక్షస పాలన అంతం, ప్రజాపాలనకు ఆరంభం అని రాసిన బ్యానర్ పట్టుకుని రోడ్డుపై బైఠాయించారు. సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైకాపా ఫ్లెక్సీలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనకు దిగిన జనసేన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
జనసేన కార్యకర్తలు ఆందోళన :పేదలకు - పెత్తందారులకు మధ్య యుద్ధం అంటూ వైఎస్సార్సీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పవన్ కల్యాణ్ ఫొటోను జనసేన నాయకుడు ప్రసాద్ తొలగించారు. దీనిపై ప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రసాద్ అరెస్ట్‌ను నిరసిస్తూ స్టేషన్ వద్ద జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
జన సైనికులను పక్కకు ఈడ్చేసిన పోలీసులు :ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు గోవిందరావును పోలీసులు అరెస్టు చేశారు. గోవిందరావును తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకునేందుకు జన సైనికులు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ సమయంలో జన సైనికులను పక్కకు ఈడ్చేసిన పోలీసులు గోవిందరావును పోడూరు స్టేషన్‌కు తరలించారు. దీన్ని నిరసిస్తూ తణుకులో జనసైనికులు ఆందోళన చేశారు.
ఏలూరు జిల్లా కైకలూరు మండలం కైకలూరులో వైఎస్సార్సీపీ, జనసేన ఫ్లెక్సీల వివాదం రచ్చకెక్కింది. పెత్తందారులకు, పేదలకు జరుగుతున్న యుద్ధం అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్.. చంద్రబాబు పల్లకిని మోస్తున్నట్లు అధికార వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై జనసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
వైఎస్సార్సీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు దీటుగా కైకలూరు తాలూకా కూడలిలో రాక్షస పాలనకు అంతం..ప్రజా పాలనకు ఆరంభం అంటూ జనసేన నాయకుడు బివి రావు ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. అధికార పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ తొలగించకుండా.. జనసేన పార్టీ ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు మాత్రమే తొలగించడంతో జనసేన నాయకుడు బివి రావు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో తాలూకా కూడలిలోని జాతీయ రహదారిపై బైఠాయించిన జనసేన నాయకులను.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదలైన జనసేన నాయకుడు బీవి రావు.. తన కార్యాలయం వరకు నడుచుకుంటూ వెళ్లారు. నాలుగేళ్ల పాలనలో ఎంత అభివృద్ధి, సంక్షేమం ఎంతమేర చేశారో చెప్పకుండా.. ఫ్లెక్సీలతో రెచ్చగొడుతున్నారని.. జనసేన నాయకుడు బీవీ రావు ఆరోపించారు. రాక్షస పాలనను తలపిస్తున్న వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే తప్పేముందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వైకాపా ఫ్లెక్సీలను తొలగించని పక్షంలో ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ముదురుతున్న జనసేన-వైఎస్సార్సీపీ ఫ్లెక్సీ యుద్ధం