Government Neglected Haj Building Constructions : మైనారిటీల సంక్షేమానికి అండాదండా అంతా తానేనని ముఖ్యమంత్రి జగన్ ఊదరగొడుతుంటారు. తీరా తన పాలనలో మైనారిటీలకు ఏం మేలు జరుగుతోందని గమనిస్తే వెంట నడుస్తున్న వారికీ సైతం మొండిచెయ్యే మిగులుతోంది. వైఎస్ఆర్ జిల్లాలో గత కొన్నేళ్లుగా అత్యధిక ముస్లింలు వైఎస్ కుటుంబం వెంటే నడుస్తున్నారు. అయినా కూడా 2014 ఎన్నికల ప్రచారంలో ముస్లింలకు ఇచ్చిన వాగ్దానం మేరకు అధికారం చేపట్టిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కడపలో 25 కోట్లతో హజ్ భవన నిర్మాణ పనులు చేపట్టారు.
2019 ఎన్నికల నాటికే దాదాపు 90 శాతంపైగా పూర్తయింది. మిగిలిన కొద్ది పనుల్ని పూర్తిచేసి ఆ భవనాన్ని అందుబాటులోకి తెచ్చేందుకూ జగన్‌కు మనసు ఒప్పలేదు. మిగతా పనులకు నిధులు విడుదల చేయాలని జిల్లా అధికారుల నుంచి ప్రభుత్వానికి నివేదిక అందినా పట్టించుకోలేదు. గత నాలుగున్నరేళ్లలో చిన్న పని కూడా చేయలేదు. ఇప్పుడు ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో మళ్లీ ముస్లిం ఓట్లు గుర్తొచ్చినట్టున్నాయి. 10 కోట్లతో పనులు చేపట్టేందుకు హడావిడి చేస్తున్నారు. జగన్ పాలనా తీరు గుత్తేదారులకు పూర్తిగా అనుభవమైనట్టుంది. కడప హజ్ భవనంపై ఎన్నికల వేళ ఆయన హడావిడి చేస్తున్నా పనులు చేసేందుకు గుత్తేదారులు ఎవరూ ముందుకు రావడంలేదు. టెండర్లు పిలిచినా పెద్దగా ఆసక్తి కనబరచనట్లు తెలుస్తోంది. జిల్లా అధికారులు పురమాయించేందుకు ప్రయత్నించినా మెల్లగా జారుకుంటున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నందున నిధుల విడుదల జాప్యమైతే తమ పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. ప్రభుత్వ పరపతి ఎంత దిగజారిందో ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు.
Janasena on Hajj Yatra: 'హజ్ యాత్రికుల అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి'
Haj Building in Vijayawada :విజయవాడలో మరో హజ్ భవనాన్ని నిర్మించాలనే ముస్లిం సంఘాల విజ్ఞప్తికి అప్పట్లో చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. 2018లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కుమ్మరిపాలెంలో 80 కోట్లతో భవనాన్ని నిర్మించేందుకు మూడెకరాలు కేటాయించి శంకుస్థాపన చేశారు. అక్కడే మసీదు, షాదీ ఖానా కూడా నిర్మించాలనుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ దీన్ని కూడా పక్కన పెట్టారు. పోనీ, మరో చోటైనా నిర్మించ తలపెట్టారా అంటే అదీ లేదు. ఏటా హజ్ యాత్ర సమయంలో హడావిడి చేయడం ఆపై మిన్నకుండటం షరామామూలే. హజ్ భవనాలకు భూములను కేటాయించాలని ముస్లిం సంఘాలు ఎన్ని సార్లు విన్నవించుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇది జగన్‌కు ముస్లింల పట్ల ఉండే చిత్తశుద్ధి. జగన్ తీరుతో విభజన రాష్ట్రానికి ఇప్పటి వరకు హజ్ భవనం సమకూరని పరిస్థితి నెలకొంది. విజయవాడలో హజ్ భవనం అందుబాటులోకి వస్తే అక్కడే మైనారిటీ ఆర్థిక, సహకార సంస్థ, వక్ఫ బోర్డు, హజ్ కమిటీ కార్యాలయాల్నీ నిర్వహించుకోవచ్చు. ప్రస్తుతం ఇవన్నీ అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.