Yanadula Committee Round Table Meeting: యానాదులకు అన్ని పార్టీలు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో యానాదుల పొలిటికల్ ఫోరం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 30% జనాభాగా ఉన్న యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని యానాదుల సంఘ నాయకులు తెలిపారు. ఖాళీగా ఉన్న ఎస్టీ కమిషన్ ఛైర్మన్ పదవి యానాదులకు ఇవ్వాలన్నారు. స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు చట్ట సభల్లో యానాదులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లో యానాదులు అధికంగా ఉన్నారన్నారు. చట్టసభల్లో యానాదుల గొంతుక వినిపించేందుకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలన్నారు. తమకు ఏ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందో ఆ పార్టీకి సంపూర్ణ మద్దతు రాబోయే ఎన్నికల్లో ఇస్తామన్నారు.
ఈ సందర్భంగా యానాదుల పొలిటికల్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ పెంచలయ్య మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా కూడా ఇంతవరకు యానాదులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో అన్ని పార్టీలు కూడా ఘోరంగా విఫలమయ్యాయి. ఈ రాష్ట్రంలో గిరిజన జనాభా 30లక్షలు ఉంటే.. అందులో 10లక్షల మంది యానాదులు ఉన్నారు. ఇంతవరకు తమకు ఎటువంటి లబ్ది చేకూర్చలేదు. ఇప్పటికైనా యానాదులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే రెండు రోజుల క్రితమే ఖాళీ అయినటువంటి ఎస్టీ కమిషన్ ఛైర్మన్ పదవిని యానాదులకు కేటాయించాలి. అలాగే యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ కల్పించాలి. అదే విధంగా చట్టసభల్లో మా గొంతుక వినిపించేందుకు ఎమ్మెల్సీ సీటును కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.