World Telugu Writers Mahasabhalu in AP: సమాజంలోని వ్యసనాలు, రుగ్మతలకు వ్యతిరేకంగా, సామాజిక పరిస్థితులను మార్చే శక్తి కవులకు, రచయితలకు మాత్రమే ఉందని తెలుగు భాషాభిమానులు చాటిచెప్పారు. తరతరాలుగా మాతృభాషలో వచ్చిన అనేక రచనలు సమాజంపై ఎంతో ప్రభావం చూపాయని సంఘటిత శక్తిగా కదిలేందుకు ప్రేరణగా నిలిచాయని అభిప్రాయపడ్డారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభల నిర్వహణ సరైన సమయంలో సరైన ఔషధమనే భావనను వ్యక్తం చేశారు.
విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల ఐదో మహాసభలు రెండోరోజూ ఉత్సాహంగా సాగాయి. మూడు వేదికలపై విభిన్న అంశాలు చర్చించారు. మారుతున్న పరిస్థితుల్లో రచయితల పాత్రపై జరిగిన సదస్సులో సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుతో సహా పలువురు పాల్గొన్నారు. బుల్లెట్లు చేయలేని పనిని- రచనలు చేసి చూపించగలవని లక్ష్మీనారాయణ అన్నారు. మత్తు పదార్ధాల బానిసత్వం నుంచి యువతను జాగృతులను చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను ప్రతిఘటించడానికి రచయితలు ఎవరూ వెనకడుగు వేయబోరని వక్తలు విశ్వాసం వ్యక్తం చేశారు.
'నేటి యువత తెలుగు భాషలో చదవలేని, రాయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఉన్న పాఠశాలల్లో ఆంగ్ల భాషతో పాటు తెలుగు భాషను ప్రోత్సహించాలి. రాష్ట్రంలో తెలుగు మాద్యమం రద్దు చేయడం దారుణం. ఐదో తరగతి వరకు కచ్చితంగా అన్ని విద్యాసంస్థల్లో తెలుగు మాద్యమాన్ని కొనసాగించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. చిన్నప్పటినుంచి భాష, వివాహజీవితంలో ఎదురయ్యే సమస్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత తల్లిదండ్రలతో పాటు ఉపాధ్యాయులపై ఉంటుంది.' - పలువురు వక్తలు