ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Harassments on Women: పెరిగిన సోషల్​ మీడియా వినియోగం.. తస్మాత్​ జాగ్రత్త అంటున్న సైబర్​ నిపుణలు

Harassments on Women: ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ దర్శనమిస్తోంది. దీంతో సామాజిక మాధ్యమాల వినియోగమూ పెరిగింది. వీటి ద్వారా మహిళలు, యువతులపై.. వేధింపులూ పెరిగాయి. వ్యక్తిగత చిత్రాలను మార్ఫింగ్ చేసి షేర్‌ చేస్తూ సైబర్‌ నేరగాళ్లు బెదిరింపులకు దిగుతున్నారు. తెలిసిన వ్యక్తులు సన్నిహితంగా ఉన్న సమయంలో తీసిన వీడియోలు, చిత్రాలను ఆన్‌లైన్‌లో పెడుతూ.. డబ్బులు డిమాండ్‌ చేస్తున్న ఘటనలు కోకొల్లలు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌ ప్రపంచంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు.

Harassment on Women
Harassment on Women

By

Published : May 16, 2023, 9:12 AM IST

పెరిగిన సోషల్​ మీడియా వినియోగం.. తస్మాత్​ జాగ్రత్త అంటున్న సైబర్​ నిపుణలు

Harassments on Women: ప్రేమ పేరుతో కొందరు.. స్నేహం పేరుతో మరికొందరు యువతులకు దగ్గరవుతారు. ఇద్దరి మధ్య విభేదాలు వస్తే స్మార్ట్‌ఫోన్‌ను ఆయుధంగా మారుస్తున్నారు. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని ప్రతీకారం తీర్చుకుంటున్నారు. విజయవాడ నగరానికి చెందిన విద్యార్థినికి, కృష్ణా జిల్లాకు చెందిన ఓ యువకుడితో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. ఇద్దరు సన్నిహితంగా ఉన్న సమయంలో ఆ యువకుడు రహస్యంగా ఫొటోలు తీశాడు. తర్వాత కొన్నాళ్లకు వీరి మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. తనను ప్రేమించకపోతే నగ్న చిత్రాలను ఆమె తండ్రికి పంపిస్తానని, పోర్న్‌ సైట్‌లో పోస్ట్‌ చేస్తానని యువకుడు వేధించాడు. ఇవి భరించలేని స్థాయికి చేరడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.

ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన ఓ వ్యక్తి.. ఓ మహిళ స్నాప్‌చాట్‌ ఖాతాలోకి చొరబడ్డాడు. ఆమె వ్యక్తిగత చిత్రాలను సేకరించాడు. తనకు నగ్న వీడియో కాల్స్‌ చేయాలని ఒత్తిడి చేశాడు. లేనిపక్షంలో ఫొటోలను మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో చెలామణి చేస్తానని బెదిరించేవాడు. ఎంతకూ వేధింపులు తగ్గకపోవడంతో పోలీసుస్టేషన్‌లో ఆ మహిళ ఫిర్యాదు చేసింది. నకిలీ ఐడీ సృష్టించి స్నేహితురాలికి అశ్లీల ఫొటోలు పంపి వేధిస్తున్న నిందితుడిని ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. ఇలా వెలుగులోకి వచ్చిన ఘటనలు కొన్ని మాత్రమే.. వెలుగులోకి రానివి ఎన్నో మన చుట్టూ పెద్దసంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి.

సోషల్‌ మీడియా ఖాతాల్లోని ఫొటోలను తీసుకుని మోసగాళ్లు వాటిని మార్ఫింగ్‌ చేస్తూ బాధితుల స్నేహితులు, బంధువులకు షేర్‌ చేస్తున్నారు. వాటిని అడ్డం పెట్టుకుని నగ్నంగా వీడియో కాల్స్‌ చేయాలని, ఫొటోలు పంపాలని ఒత్తిడి చేస్తున్నారు. సమస్య అంతటితో పరిష్కారమవుతుందని కొందరు సైబర్‌ నేరగాళ్లు చెప్పినట్లే చేస్తున్నారు. ఆ తర్వాత కూడా వేధింపులు ఆగడం లేదు. అడిగినంత డబ్బు పంపాలని, లేనిపక్షంలో వాటిని బహిర్గతం చేస్తానని బెదిరింపులకు దిగుతున్నారు. ఇలా మోసగాళ్ల బారిన పడుతున్న మహిళలు, యువతుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వీరిలో పదో వంతు మంది మాత్రమే ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.

చాలా మంది పరువు పోతుందనే భయంతో లోలోనే కుంగిపోతున్నారని వివరిస్తున్నారు. ఈ విషయం భర్త, తల్లిదండ్రులకు చెప్పుకోలేక పలువురు ఆత్మహత్యలకు సైతం వెనకాడటం లేదు. ఫోన్‌ నెంబర్లు, మెయిల్‌ ఐడీలు, మ్యాట్రిమోనీ సైట్లలోని ఫొటోలను సేకరించి.. వాటిని మార్ఫింగ్‌ చేసి డేటింగ్, పోర్న్‌ సైట్లలో పోస్ట్‌ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నిందితుల్లో ఎక్కువ మంది బాధితులకు తెలిసిన వారే ఉంటున్నారు. ఎదుటి వారిపై కక్ష సాధింపులో భాగంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. వ్యక్తిగత చిత్రాలను సామాజిక మాధ్యమ ఖాతాల్లో వీలైనంత వరకు పోస్ట్‌ చేయకపోవడం మంచిదని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఎవరైనా వేధింపులకు గురి చేస్తే టోల్‌ఫ్రీ నెంబర్‌ 1930కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details