Welfare Hostel Students Fire on CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాలుగున్నరేళ్ల పరిపాలనలో సంక్షేమ వసతి గృహాలు అధ్వానంగా తయారయ్యాయి. ఏ వసతి గృహాన్ని సందర్శించినా కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. హాస్టళ్లలో విద్యార్థులు పడుతున్న కష్టాలు, అవస్థలు మాటల్లో చెప్పలేని స్థితికి చేరాయి. సంక్షేమ వసతి గృహాల్లో కిటికీలుంటాయి కానీ వాటికి తలుపులుండవు!. లైట్లుంటాయి కానీ అవి వెలగవు! ఫ్యాన్లు ఉంటాయి కానీ తిరగవు.! నీటి కొళాయిలుంటాయి కానీ పైపులుండవు. పైకప్పులు పెచ్చులూడుతున్నాయి!, పరిసరాలు కంపుకొడుతున్నా అధికారులు పట్టించుకోని పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాల పరిస్థితులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న అవస్థలపై ఈటీవీ భారత్ చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
బీద విద్యార్థులపై సీఎం జగన్ ప్రగల్భాలు: రాష్ట్రంలో ఏ ప్రాంతంలో బహిరంగ సభ పెట్టిన సీఎం జగన్ మోహన్ రెడ్డి పేద పిల్లలపై ఎనలేని ప్రేమను ఒలకబోస్తారు. తమ పరిపాలనలో బీద పిల్లలకు ఇది చేశాం, అది చేశాం అని బీరాలు పలుకుతారు. కానీ, క్షేత్రస్థాయిలో ఒకసారి పరిశీలిస్తే ముఖ్యమంత్రి జగన్ చెప్పినా మాటలకి, అక్కడి పరిస్థితులకు ఎటువంటి సంబంధం ఉండదు. అందుకు నిదర్శనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాలే. రాష్ట్రంలోని పిల్లలకు మేనమామనంటూ వరసలు కలిపేసుకున్న సీఎం జగన్, బీద విద్యార్థుల సంక్షేమాన్ని గాలికొదిలేశారు.
అంధుల పాఠశాలలో అలజడి- రాజమహేంద్రవరంలో దివ్యాంగుల ఆశ్రమ పాఠశాల కూల్చివేత
అక్కడే పాఠం-అక్కడే పడక: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాటలు నమ్మి, ఎవరైనా రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల వైపు చూశారో ఇక అంతే. హాస్టళ్లలో పిల్లల పడుతున్న కష్టాలను చూసి తల్లిదండ్రుల కచ్చితంగా కన్నీరు కార్చాల్సిందే. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాల్లో పిల్లలు కటిక నేలపై పడుకుంటున్నారు. కంటి నిండా నిద్రలేక అవస్థలు పడుతున్నారు. చలికి గజగజ వణుకుతున్నారు. సరైన సదుపాయాలు లేక విలవిలలాడుతున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సంక్షేమ వసతి గృహాల్ని బాగు చేయాలని విద్యార్థులు వేడుకుంటున్నారు.
టెక్కలిలో టూ ఇన్‌వన్:శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని గిరిజన, సంక్షేమ వసతి గృహంలో 150 మంది విద్యార్థులు గదులు చాలక టూ ఇన్‌వన్‌గా వినియోగిస్తున్నారు. మధ్యాహ్నం అదే గదిలో పాఠం వినడం, రాత్రికి వాటిని పక్కకు జరిపి అక్కడే పడుకుంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు రూ.8 కోట్ల 75 లక్షలతో అదనపు తరగతి గదులు, డార్మెటరీ, ఓవర్ హెడ్ ట్యాంకు, మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టారు. గత ఎన్నికల నాటికే రూ.3 కోట్ల 57 లక్షల విలువైన పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత అధికారంలోకొచ్చిన వైసీపీ సర్కార్, గుత్తేదారులకు బిల్లులు ఇవ్వకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. నాలుగున్నరేళ్లుగా పిల్లలు ఇలా అవస్థలు పడుతున్నా జగన్ సర్కార్ మాత్రం చిల్లిగవ్వ ఇవ్వకపోవడంపై విద్యార్థులు మండిపడుతున్నారు.