Krishna Delta Water Released: ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో కృష్ణా డెల్టాకు రాష్ట్ర ప్రభుత్వం సాగు నీరు విడుదల చేసింది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణా ఈస్ట్రన్ హెడ్ రెగ్యులేటరీ ద్వారా జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, మంత్రులు జోగి రమేష్, తానేటి వనిత, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావులు కాలువలకు నీరు విడుదల చేశారు. శాస్త్రోక్తంగా పూజ చేసి, కొబ్బరి కాయ కొట్టిన మంత్రి అంబటి రాంబాబు.. పూలు, పండ్లు, గాజులు, పసుపు, కుంకుమ, సారెను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కాలువలోకి వదిలారు.
గుంటూరు, కృష్ణా జిల్లాల కాలువలకు నీరు విడుదల చేశామని మంత్రి అంబటి తెలిపారు. ఈరోజు వెయ్యి క్యూసెక్కుల నీరు విడుదల చేశామని.. డిమాండ్‌ను బట్టి మరింత పెంచే అవకాశం ఉందని మంత్రులు తెలిపారు. పూర్వం జూన్ నెలాఖరులో, జులై మొదటి వారంలో వదిలేవారని.. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో నెల ముందే నీరు ఇచ్చామని మంత్రి అంబటి తెలిపారు. ఖరీఫ్ సీజన్ త్వరగా ప్రారంభం కావడం వల్ల మూడు పంటలు పండే అవకాశం ఉందని మంత్రి అంబటి పేర్కొన్నారు. ప్రకృతి విపత్తుల నుంచి కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. సాగర్ నుంచి నీరు రాకుండానే పులిచింతలలో 34 టీఎంసీల నీరు నిల్వ ఉందన్న మంత్రి.. అక్కడి నుంచే నీటిని రైతులకు అందిస్తున్నామన్నారు.