AP Weather Updates: ఉత్తర కోస్తాంధ్ర- ఒడిశా తీరాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై బలమైన అల్పపీడనం కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి అనుబంధంగా రుతుపవన ద్రోణి, ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రంస్పష్టం చేసింది. కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు, రాయలసీమలో చాలా చోట్ల తేలికపాటి నుంచి విస్తారంగా వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. రేపటి వరకూ కోస్తాంధ్ర జిల్లాలు, తెలంగాణలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
Rains in Andhra Pradesh: అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం, ఏలూరు జిల్లా నూజివీడులో అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఏలూరు నగరం, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 10 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. కృష్ణా జిల్లా నందివాడ, ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం లో 9 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదు అయ్యింది.
విజయవాడలో 8 సెంటీమీటర్ల వర్షం పడింది. విశాఖపట్నం, ఏలూరు జిల్లా కొయ్యలగూడెం, అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం, గుంటూరు జిల్లా, శ్రీకాకుళం జిల్లా సోంపేట, కాకినాడ జిల్లా తుని, ఏలూరు జిల్లా కైకలూరు, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఇక మరోవైపు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు.. ఎగువ నుంచి వస్తున్న వరదల కారణంగా పలు జలాశయాల్లోకి వరద ప్రవాహం పెరుగుతోంది.