Water Drinking is Good For Health : రోజూ నీరు తాగుతాం. సాధారణంగా దాహమేసినప్పుడు.. అన్నం తిన్నప్పుడు తాగుతుంటాం. కొందరు నియమంగా లెక్క పెట్టుకుని మరీ లీటర్ల కొద్దీ తాగుతుంటారు. ఎన్ని విశ్లేషణలున్నా.. మంచి ఆరోగ్యంతో తొణికిసలాడాలంటే రోజుకు ఎన్ని నీరు తాగాలనేది ఎక్కువమందికి ప్రశ్నే.
Water Drinking Benefits : ఈ క్రమంలో సాధారణ వ్యక్తి రోజుకు 7 నుంచి 10 గ్లాసుల నీళ్లు.. అంటే 2-3 లీటర్ల నీటిని తాగడం ద్వారా దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండడం సాధ్యమవుతుందని అమెరికా పరిశోధకులు అధ్యయనపూర్వకంగా తేల్చారు. ఎండలో, వేడి ప్రదేశాల్లో పనిచేసేవారు, ఎక్కువ శారీరక శ్రమ చేస్తున్నవారు.. ఈ మోతాదును కొంత మేర పెంచుకోవచ్చని సూచిస్తున్నారు. మొత్తంగా తక్కువ కాకూడదు, ఎక్కువ కాకూడదు అని స్పష్టం చేస్తున్నారు.
తగినంత నీటిని తాగడం ద్వారా దీర్ఘాయుష్షును సొంతం చేసుకోవచ్చనే కోణంలో ఆ దేశానికి చెందిన ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్’ 30 ఏళ్ల పాటు ఈ అధ్యయనం నిర్వహించింది. ఈ పరిశోధనలో 11,255 మంది పాల్గొనగా.. 30-45 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వారి ఆరోగ్య వివరాలను నమోదు చేశారు. వారు 70-90 ఏళ్ల వయసుకు వచ్చాక మరోసారి పరిశీలించారు. ఈ వివరాలు ‘ఇ బయోమెడిసిన్’ వైద్య పత్రికలో తాజాగా ప్రచురితమయ్యాయి. ఆ నివేదిక వివరాలతో పాటు ఆరోగ్యకర జీవనానికి తాగునీటి ఆవశ్యకతపై కిమ్స్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ అకడమిక్స్ డైరెక్టర్ డాక్టర్ మణిమాలరావు పలు అంశాలను వివరించారు.
దాహమేసిన వెంటనే తాగాలి..శరీరంలో 60-65% వరకూ నీరే ఉంటుంది. చిన్న పిల్లల్లో అయితే 80% ఉంటుంది. పురుషులతో పోలిస్తే మహిళల శరీరంలో నీరు కొంత తక్కువగా ఉంటుంది. శరీరంలో జీవక్రియల్లో ఉత్పత్తి అయ్యే మలినాలను కిడ్నీల ద్వారా బయటకు పంపించడంలో నీరు కీలక పాత్ర పోషిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచుతుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
- శరీరంలోని అంతర్గత కణాల్లో తాజా నీరు ఉంటుంది. కణాల వెలుపల సోడియంతో కూడిన నీరు ఉంటుంది. ఈ రెండింటి మధ్య నిరంతరాయంగా ఇచ్చిపుచ్చుకోవడాలు కొనసాగుతుంటాయి. ఈ ప్రక్రియ సరిగ్గా జరగనప్పుడు వ్యాధులు చుట్టుముడతాయి.
- నీరు ఎక్కువ తాగినా అవేమీ ఒంట్లో నిల్వ ఉండవు. బయటకు వెళ్లిపోతాయి. పైగా ఆ నీటిని వడబోయడానికి కిడ్నీలు అధికంగా శ్రమించాల్సి వస్తుంది. ఈ సమస్య లేకుండా ఎప్పుడు దాహమేస్తే అప్పుడు మంచినీరు తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. కనీసం దాహమేసిన 15 నిమిషాల్లోపు తాగడం మంచిది.
- అయితే రోజువారీ నీటిని ఒకేసారి తాగడం మంచిది కాదు. ఒకేసారి తాగితే.. శరీరం ఎక్కువ నీరుందని భావించి బయటకు పంపించేస్తుంది. మరీ కొంచెం తాగితే.. ఆ నీళ్లను దాచిపెడుతుంది. రెండూ మంచిది కాదు.
- మనం నిత్యం తినే కూరగాయలు, పండ్లలోనూ నీరు ఉంటుంది. ముఖ్యంగా బత్తాయి, నారింజ వంటి పండ్లను తింటున్నప్పుడు ఎక్కువగా నీటిని తాగాల్సిన అవసరం ఉండదు.
- వయసు పెరుగుతున్న కొద్దీ కూడా నీరును ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు 65-70 ఏళ్లు దాటిన వారు అధికంగా నీరు తాగితే.. వారి కిడ్నీలపై త్వరగా దుష్ప్రభావం పడే అవకాశాలున్నాయి.
మరీ ఎక్కువ తాగితే.. ఒంట్లో ఎక్కువగా నీరు చేరడం వల్ల అన్ని అవయవాల్లోని కణాల్లో నీటి శాతం ఎక్కువవుతుంది. కణాల బయట ఉండాల్సిన సోడియం.. కణాల లోపలకు చేరుతుంది. తద్వారా ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. తల తిరగడం, తలనొప్పి, అయోమయం, రక్తపోటు పెరుగుతుంది. గుండె లయ తప్పుతుంది. కిడ్నీలపై భారం పెరిగి మూత్రపిండాల వైఫల్యానికి దారి తీస్తుంది.