Vykuntapuram Barrage Construction Stop :కృష్ణా నదిలో వరద రోజులు తగ్గిపోతున్నాయని... తక్కువ రోజుల్లోనే ఎక్కువ నీళ్లు ఒడిసిపట్టుకోలేకపోతే రాష్ట్రం అన్యాయమైపోతుందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనేక సమావేశాల్లో చెబుతూ వచ్చారు. మాటలు ఐతే కోటలు దాటుతున్నాయి కానీ పనులు మాత్రం ఆచరణకు నోచుకోవడం లేదు. కృష్ణా జలాలను ఒడిసిపట్టేలా.. 10 టీఎంసీల సామర్థ్యంతో గత ప్రభుత్వం రూపొందించిన వైకుంఠపురం బ్యారేజీ ప్రాజెక్టు (Vykuntapuram Barrage on Krishna River)ను వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే నిర్దాక్షిణ్యంగా నిలివేసింది. ప్రాజెక్టు సాకారమైతే భూగర్భ జలాల వృద్ధితో పాటు కరవు ప్రాంతాలకు ఎత్తిపోతలతో నీటిని తరలించే వీలుండేది. కానీ జగన్ సర్కారు ఈ యత్నాలన్నింటినీ మొగ్గలోనే తుంచేసింది.
TDP Government Foundation Stone toVykuntapuramBarrage on Krishna River in 2019 :టీడీపీ ప్రభుత్వ హయాంలో నవ్యాంద్ర 'రాజధాని అమరావతి తాగునీటి అవసరాలతో పాటు అత్యవసర సమయంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సాగునీటి కొరత తీర్చేలా వైకుంఠపురం ప్రాజెక్టు నిర్మాణానికి రూపకల్పన చేసింది. ప్రకాశం బ్యారేజీకి 23 కిలోమీటర్ల ఎగువన పులిచింతలకు 60 కిలోమీటర్ల దిగువన దీనిని నిర్మించాలని రూ.2.169 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు.
ఇందులో భూసేకరణకు రూ.771 కోట్లు, బ్యారేజీ నిర్మాణానికి రూ.1,088 కోట్లు, నావిగేషన్ పనులకు రూ.88 కోట్లు, రహదారులు, భవనాల నిర్మాణం, ఇతర మౌలికవసతుల ఏర్పాటుకు రూ.222 కోట్లు కేటాయించారు. 2019 ఫిబ్రవరిలో నిర్మాణం ప్రారంభించి, 24 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు పూర్తిగా నిలిపివేసిందని ఆ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైకుంఠపురం బ్యారేజీ పనులు ఎందుకు ఆపారు: దేవినేని
రాష్ట్ర ప్రజల కలల ప్రతిరూపం అమరావతి సాకారానికి అధికారంలోకి వచ్చిన వెంటనే మోకాలొడ్డిన జగన్ సర్కారు.. రాజధాని భవిష్యత్తు అవసరాలు తీర్చేలా గత ప్రభుత్వం రూపొందించిన ప్రాజెక్టులన్నింటినీ నామరూపాలు లేకుండా చేసింది. రోడ్లు, డ్రెయిన్లు, బాహ్య వలయ రహదారి, రైల్వేలైను నిర్మాణాలను అటకెక్కించింది. అదే తరహాలో ఎంతో ప్రయోజనకరమైన వైకుంఠపురం ప్రాజెక్టునూ అడ్డుకుంది.
కృష్ణాలో ఎప్పుడు దండిగా నీళ్లు వస్తాయో, ఎప్పుడు కరవు పరిస్థితులు వస్తాయో ఊహించలేము. శ్రీశైలం జలాశయం ఇప్పటికీ పూర్తిగా నిండలేదు. కృష్ణా, సాగర్ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీళ్లందించే భరోసా ఇంకా ఏర్పడలేదు. అయినా జులై నెలలో కురిసిన వర్షాలతో 53 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీ దాటి సముద్రంలో కలిసిపోయాయి. కిందటి నీటి సంవత్సరం మొత్తం మీద 1,131 టీఎంసీలు ఇలాగే వృథా అయ్యాయి.