VMC SPORTS AND CULTURAL MEET 2023: ప్రభుత్వ ఉద్యోగుల్లో క్రీడా స్పూర్తిని పెంచడం, ఉల్లాసం, ఉత్సాహం కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా పోటీలను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు. క్రీడల వల్ల ఒత్తిళ్లతో బిజీగా ఉండే ఉద్యోగులకు ఆరోగ్యం ఆనందం సాకారం అవుతుందని, ఉద్యోగులు క్రీడల్లో రాణించి సత్తా చాటాలని అన్నారు. ఉద్యోగుల కోసం విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో మూడు రోజుల పాటు నిర్వహించిన స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్- 2023 ఆదివారం ముగింపు సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ ,ఉద్యోగులు పాల్గొన్నారు.
క్రీడల్లో విజేతలుగా నిలిచిన ఉద్యోగులకు మెమెంటోలు: నిత్యం ప్రజా సమస్యల్లో బిజీగా ఉండే ఉద్యోగులకు రిలీఫ్ కోసం క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో తొలి సారిగా ఏర్పాటు చేసిన క్రీడా పోటీల్లో పలువురు ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని సత్తా చాటారని ప్రసంశించారు. క్రీడా స్పూర్తిని పెంచేందుకే స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ నిర్వహించామని కమిషనర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. ఉద్యోగులు చూపించిన క్రీడా స్పూర్తికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. క్రీడలు విజయవాడగా తీర్చిదిద్దడంలో పలువురు స్పాన్సర్లు భాగస్వామ్యులు అవడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా క్రీడల్లో విజేతలుగా నిలిచిన ఉద్యోగులకు మెమెంటోలు అందించి ప్రోత్సహించారు. సహకరించిన స్పాన్సర్లు, ఉద్యోగులను సన్మానించారు.