VIRAL FEVERS INCREASED : రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. 3 రోజుల్లో తగ్గే జలుబు, దగ్గు నెలల తరబడి వెంటాడుతోంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు . విజయవాడ, గుంటూరు, విశాఖ, రాజమహేంద్రవరం, తిరుపతిలో ఆసుపత్రులకు వైరల్ జ్వరాలు, దగ్గు కేసులే ఎక్కువగా వస్తున్నాయి. చికిత్స అందించే క్రమంలో వైద్యులు అనారోగ్యం పాలవుతున్నారు.
విజయవాడ GGHలో... ముగ్గురు పీజీ వైద్యులు ఇలాగే అస్వస్థతకు గురయ్యారు. ‘ఇప్పటి వరకు ఆస్తమా లక్షణాలు లేని వారు కూడా ఉన్న వారి మాదిరిగానే బాధపడుతున్నారు. బాధితులను పొడి దగ్గు చాలారోజులపాటు వేధిస్తోందని వైద్యులు చెబుతున్నారు. కొందరు బాధితులకు జలుబు, దగ్గు తగ్గినట్లే తగ్గి మళ్లీ ఇబ్బంది పెడుతున్నాయని వైద్యులు తెలిపారు. పిల్లలు, వృద్ధులు, చలి ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వాళ్లు, మధుమేహం నియంత్రణలో లేనివాళ్లు బాధపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు.
"ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ జూన్ సమయంలో లేదా చలికాలంలో ఎక్కువుగా ఉండేవి. కానీ ఇప్పుడు సీజన్‌తో సంబంధం లేకుండా వ్యాపిస్తున్నాయి. గత రెండు సంవత్సరాలతో పోలిస్తే 60శాతం ఎక్కువుగా కేసులు పెరిగాయి. ఈ ఇన్ఫెక్షన్స్ ముందుగా తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలతో మొదలవుతుంది. అలా వారం రోజులు గడిచినా జ్వరం తగ్గుతుంది కానీ జలుబు, దగ్గు మాత్రం తగ్గదు. కొద్దిమందికి నెలరోజులకు పైగానే ఈ సమస్య ఉంటుంది"-డా.పూజిత, జనరల్ ఫిజీషియన్
జలుబు, ఎడతెరపిలేని దగ్గు, గొంతునొప్పి, ఒళ్లునొప్పులు వైరల్ జ్వరానికి ప్రధాన లక్షణాలు. వైరస్ సోకిన రెండు రోజుల్లోపే బాధితులపై ప్రభావం కనిపిస్తోంది. కళ్లు ఎరుపెక్కడం, తుమ్ములు, దగ్గు, గొంతువాపు, ముక్కు కారడం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది వంటి వాటితో..... బాధితులు ఇబ్బందిపడుతున్నారు. చిన్నారులకు నెలల తరబడి జలుబు, దగ్గు ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. డెంగ్యూ, మలేరియా ఈ సీజన్‌లో కొంతమేర తగ్గినా .. ఎడినో, బొంకా వైరస్‌లు ప్రభావం చూపిస్తున్నట్లు పిల్లల వైద్యులు డా.పి వి రామారావు తెలిపారు.