Vijayawada Minor Girl Case Judgment : తనకు కుమార్తె వయసు ఉన్న బాలికను ప్రతిరోజు లైంగికంగా వేధించి, ఆత్మహత్యకు కారకుడైన వ్యక్తి న్యాయస్థానం శిక్ష విధించింది. 2 నెలల పాటు ప్రతిరోజు అసభ్యకర మాటలతో ఇబ్బంది పెట్టడంతో భరించలేక అపార్ట్‌మెంట్‌పైకి వెళ్లి దూకి ప్రాణాలు తీసుకుంది. ఈ కేసులో బాలికను లైంగిక వేధించి, ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు నిందితుడు వినోద్ కుమార్ జైన్ (49)కు జీవిత ఖైదు, మూడు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ విజయవాడ పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎస్.రజిని బుధవారం తీర్పు చెప్పారు.
వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు : గత సంవత్సరం జనవరి 29న జరిగిన ఈ ఘటనకు సంబంధించి మైనర్ అమ్మాయి తాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదే రోజు భవానీపురం పోలీసులు ఐపీసీ సెక్షన్లు 306, 354ఏ, 354, , 509, 354డి,506, పోక్సో చట్టంలోని 8, 10 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టారు. కేసును భవానీపురం పీఎస్ ఎస్ఐ ప్రసాద్ దర్యాప్తు చేశారు. ఈ కేసులో 20 మంది సాక్షుల విచారించి, వారి వాగ్మూలాలను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు గుజ్జల నాగిరెడ్డి, జీవీ నారాయణరెడ్డి న్యాయస్థానంలో నమోదు చేయించారు. ఈ కేసులో నిందితుడిపై నేరారోపణ రుజువు అయింది. నిందితుడు గత సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు రిమాండ్‌లోనే ఉన్నాడు.
క్రూరమైన నేరంగా పరిగణించాలని తీర్పు :ఐపీసీ సెక్షన్ 305 కింద జీవిత ఖైదు, లక్ష రూపాయల జరిమానా, పోక్సో సెక్షన్ 9 (ఎల్), 10 కింద ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, 50వేలు రూపాయల జరిమానా, పోక్సో చట్టం సెక్షన్ 12 కింద మూడు సంవత్సరాల శిక్ష, 50వేల రూపాయల జరిమానా, ఐపీసీ సెక్షన్ 354 కింద ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 50వేల రూపాయల జరిమానా, ఐపీసీ సెక్షన్ 509 కింద మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 50వేల రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ఈ శిక్షలన్నీ ఒకే సమయంలో అమలవుతాయని, 3 లక్షల రూపాయలు జరిమానాలో, 2.4లక్షల రూపాయలు బాధితురాలి కుటుంబానికి చెల్లించాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. మైనర్ బాలికను లైంగికంగా వేధించి ఆమె మరణించడానికి కారణమైన, ఆమె తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురి అవ్వడానికి కారణమైన ఈ కేసును క్రూరమైన నేరంగా పరిగణించాలని న్యాయమూర్తి తీర్పులో తెలిపారు.