Village, Ward Secretariat Employees Agitation : రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలను పరిష్కరించకుంటే రేపటి నుంచి మూడో దశ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ నిరసన తెలియజేశారు.
ప్రభుత్వం శ్రమ దోపిడీకి పాల్పడింది : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఏపీ అమరావతి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఏపీజేఏసీ మలిదశ ఉద్యమ కార్యాచరణలో భాగంగా చివరి రోజైన ఈ రోజు.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ధర్నాలు నిర్వహించారు. వారి సమస్యలపై ధర్నా నిర్వహించగా.. కృష్ణా జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో బొప్పరాజు పాల్గొన్నారు. రెండు సంవత్సరాలలో ప్రొహిబిషన్ డిక్లేర్ చేస్తానన్న ప్రభుత్వం.. రెండు సంవత్సరాల తొమ్మిది నెలల తర్వాత డిక్లేర్ చేసి శ్రమ దోపిడీకి పాల్పడిందని ఆయన విమర్శించారు.
ఏపీ ఐకాస అమరావతి ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ఇప్పటికే పలుమార్లు వినతి పత్రాలు అందజేసినా.. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జాబ్ చార్ట్ ఇవ్వాలని కోరారు. సంబంధం లేని పనులను సచివాలయ సిబ్బందికి అప్పగిస్తున్నారని ఇది సరికాదని అన్నారు. వేతన బకాయిలు, పదోన్నతులు, ఉద్యోగాల్లో బదిలీలు తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు, పింఛన్లు చెల్లించాలని కోరారు. 11వ పీఆర్సీ ప్రతిపాదించిన స్కేల్స్ బయటపెట్టాలని.. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏల అరియర్స్ చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. బాకీ ఉన్న పీఆర్సీ బకాయిలు చెల్లించాలన్నారు. 12వ పే రివిజన్ కమీషన్‌ను వెంటనే నియమించాలని కోరారు. సీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచాలని కోరారు. నూతనంగా ఏర్పడిన జిల్లా కేంద్రాల్లో 16 శాతం హెచ్ఆర్ఎ ఇవ్వాలన్నారు. ఈ సంవత్సరంలో ఫిబ్రవరి 13న సీఎస్‌కు అందించిన మెమోరాండంలోని డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.