Vijayawada Sercice Roads in Damaged Condition: బెజవాడ నగరంలో సర్వీసు రోడ్లు అధ్వాన్నంగా మారాయి. వర్షం పడితే గుంతలు ఎక్కడున్నాయో తెలియక వాహనదారులు అవస్థలు పడుతున్నారు. సర్వీసు రోడ్లు దారుణంగా ఉన్నా.. కనీస మరమ్మతులు కూడా చేయకపోవడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. చిన్నపాటి వర్షం పడినా సర్వీస్ రోడ్లన్ని జమమయమవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షం నీరు దాదాపు 2 నుంచి 3 రోజుల వరకు రోడ్లపై నిల్వ ఉంటుందోనని అంటున్నారు.
విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్‌కి ఇరువైపులా ఉన్న సర్వీసు రోడ్డు అధ్వాన్నంగా తయారైంది. సుమారు రెండు కిలోమీటర్ల పొడవున్న ఈ సర్వీసు రోడ్డుపై చిన్నపాటి వర్షానికే రోజుల తరబడి నీరు నిలుస్తోంది. సర్వీసు రోడ్డుకు ఆనుకుని ఉన్న డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షానికి మురుగు నీరు రహదారిపై ప్రవహిస్తోంది. ఫ్లైఓవర్ నిర్మించి ఏళ్లు గడుస్తున్నా సర్వీసు రోడ్డుకు మాత్రం నేటికీ మోక్షం లభించలేదు.
కల్లాలుగా మారుతున్న ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని సర్వీసు రోడ్లు
బెంజ్ సర్కిల్ సర్వీసు రోడ్డు వెడల్పు తక్కువగా ఉన్నందున తరచూ ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. రహదారిపై పెద్ద పెద్ద గుంతలు పడటంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వర్షం వచ్చినప్పుడు మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తుడడంతో దుర్వాసన వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయని.. పాలకులు దృష్టి సారించటం లేదని వాపోతున్నారు.
"రోడ్లన్ని చాలా అధ్వాన్నంగా ఉన్నాయి. డ్రైనేజీ లీకై ఇదే రోడ్డుపై పారుతోంది. ఏ ఏరియాకు వెళ్లినా రోడ్లు ఇబ్బందిగా ఉన్నాయి." - స్థానికుడు