Vijayawada RTC Bus Accident: సమయం ఉదయం 8 గంటల 30 నిమిషాలు.. బస్సుల కోసం వెతుక్కుంటూ ప్లాంట్ ఫాంపై తిరుగుతున్న ప్రయాణికులు.. రెప్పపాటు వ్యవధిలోనే బీభత్సం సృష్టించిన బస్సు ముగ్గురు పాలిట మృత్యువులా మారింది. ఈ విషాద ఘటన విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో జరిగింది. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లేందుకు ఆటోనగర్ డిపోకు చెందిన మెట్రో లగ్జరీ నాన్ స్టాప్ బస్సు 24 మంది ప్రయాణికులతో బయలుదేరేందుకు 12 నెంబర్ ప్లాంట్ ఫాం వద్ద సిద్ధంగా ఉంది.
బస్సును వెనెక్కి తీసేందుకు.. డ్రైవర్ గేర్ వేసి ఎక్స్‌లేటర్ తొక్కారు. కదలకపోవడంతో.. ఎక్స్‌లేటర్ గట్టిగా తొక్కారు.. అంతే.. ఒక్కసారిగా బస్సు ప్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చింది. ఇనుప బారికేడ్లు, కుర్చీలు, స్తంభం తీవ్రంగా ధ్వంసమయ్యాయి. బస్సు కింద పడి ముగ్గురు దుర్మరణం చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి.
బస్సు టైర్ల కింద పడి చీరాలకు చెందిన 45 ఏళ్ల కుమారి, ఆర్టీసీ బుకింగ్ క్లర్క్ అక్కడికక్కడే చనిపోయారు. ఆరు నెలల చిన్నారి కత్తి చెర్రీ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ.. ఆస్పత్రిలో మృతి చెందాడు. తీవ్రంగా గాయాలపాలైన మరో ఇద్దరు ప్రయాణికులను ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. బస్సు స్టాళ్ల పైకి వెళ్లి ఉంటే మరింత మందికి గాయాలయ్యేవని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బస్సు కండిషన్ బాగోలేకపోవడం వల్లే ప్రమాదం సంభవించిందని డ్రైవర్ ప్రసాద్ చెప్పారు.
బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున పది లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. ప్రమాదస్థలిని పరిశీలించిన ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు.. ప్రమాదం జరిగిన తీరును ప్రత్యక్ష సాక్షులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరుపుతామని తెలిపారు. మృతుల కుటుంబాలకు సంస్థ నుంచి రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.