ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడ బస్సు విషాదానికి కారణం - తప్పుడు నివేదికకు అధికారులు సిద్ధమవుతున్నట్లు ఆరోపణలు - Bus Accident In AP

Vijayawada RTC Bus Accidents Reasons: విజయవాడలో సోమవారం జరిగిన బస్సు విషాదానికి ఆర్టీసీ అధికారులే కారణం అనే విమర్శలు వస్తున్నాయి. కానీ యంత్రాంగం మాత్రం బస్సు డ్రైవరే ప్రమాదానికి కారణమనే నివేదికతో చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

vijayawada_rtc_bus_accidents_reasons
vijayawada_rtc_bus_accidents_reasons

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 7, 2023, 7:26 AM IST

విజయవాడ బస్సు విషాదానికి కారణం - తప్పుడు నివేదికకు అధికారులు సిద్ధమవుతున్నట్లు ఆరోపణలు

Vijayawada RTC Bus Accidents Reasons: విజయవాడ బస్టాండ్‌లో సోమవారం జరిగిన బస్సు ప్రమాద దుర్ఘటనకు.. ఆర్టీసీ అధికారులే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. డ్రైవర్‌కు సరిగ్గా శిక్షణ ఇవ్వకుండానే ఆటోట్రాన్స్‌మిషన్‌ బస్సులో విధులు అప్పగించడమే ఘోరం జరగడానికి కారణంగా తెలుస్తోంది. అధునాతన సాంకేతికత కలిగిన బస్సు నడిపేందుకు రెండు రోజుల శిక్షణ సరిపోలేదన్నా.. అధికారులు పట్టించుకోలేదని తెలిసింది.

బస్సులో ఎక్స్‌లేటర్‌ స్తంభించడం ప్రధాన కారణంగా తెలుస్తుండగా.. ఈ సమస్యపై పలుమార్లు డ్రైవర్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. కనీస మరమ్మతు చేయకుండానే సర్వీసు కొనసాగించారు. వాస్తవాలను కప్పిపుచ్చి డ్రైవర్‌నే ప్రమాదానికి బాధ్యుడుగా చేసి చేతులు దులిపేసుకునేలా విచారణ నివేదిక సిద్దం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఉలిక్కిపడేలా చేసిన విజయవాడ బస్టాండ్​ ఘటన - సీసీ టీవీలో ప్రమాద దృశ్యాలు

బస్సులు ఎంత ఘోరంగా ఉన్నాయో నిదర్శనం: ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం అనేది నినాదం. కానీ బస్సుల్లో ప్రయాణమే కాదు, ఆర్టీసీ బస్టాండ్లలో నిరీక్షణ కూడా ప్రమాదకరం అనేలా విజయవాడ ఘటన ఆందోళన కలిగిస్తున్నది. కొంతకాలంగా ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురవుతుండటం ఆందోళన కలిగిస్తుండగా.. తాజాగా విజయవాడ బస్టాండ్‌లోని ప్లాట్‌ఫామ్‌పైకి బస్‌ దూసుకెళ్లి ముగ్గురు చనిపోవడం.. సంస్థ బస్సులు ఎంత ఘోరంగా ఉన్నాయనేదానికి నిదర్శనంగా నిలిచింది.

డ్రైవర్​పైనే నెట్టి చేతులు దులుపుకునే ప్రయత్నం: మరో 85రోజుల్లో పదవీ విరమణ చేయనున్న డ్రైవర్‌కు.. బలవంతంగా ఆటోమెటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ విధానంలోని బస్‌లో విధులకు పంపడం, దీనిపై ఆయనకు పూర్తి అవగాహన లేకపోవడం ప్రమాదానికి ఓ కారణమైతే.. బస్‌ ఎక్స్‌లేటర్‌ ఫెడల్‌ ఇరుక్కుపోతోందని, సరిచేయాలని డ్రైవర్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చూపడం మరో కారణం. అధికారులు మాత్రం కేవలం డ్రైవర్‌ తప్పిదం వల్లే ఇదంతా జరిగిందనేలా నివేదిక సిద్ధం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

విజయవాడ బస్సు ప్రమాదంపై సీఎం జగన్, ఆర్టీసీ ఎండీ దిగ్భ్రాంతి- రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటన

తరచు పాడవుతున్న బస్సులు: ప్రమాదానికిగురైన బస్సు ఆటోమెటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ విధానంలో నడుస్తుంది. విజయవాడ ఆటోనగర్‌ డిపోలో ఇలాంటివి 13 బస్సులున్నా.. తరచూ పాడవుతున్న కారణంగా ఆరింటినే నడుపుతున్నారు. డ్రైవర్లకు గతంలో బెంగళూరులోని వోల్వో కంపెనీ కేంద్రానికి పంపి, శిక్షణ ఇప్పించేవారు. కొంతకాలంగా కొత్త డ్రైవర్లకు డిపోకి చెందిన సేఫ్టీ డ్రైవింగ్‌ ఆఫీసర్‌తోనే శిక్షణ ఇప్పిస్తున్నారు.

కేవలం రెండే రోజులు శిక్షణ: గతనెల వరకు విజయవాడ-బెంగళూరు సూపర్‌ లగ్జరీ సర్వీసులో విధులు నిర్వహించిన డ్రైవర్‌ ప్రకాశంను వయసు రీత్యా దూరప్రాంత సర్వీసులకు పంపకూడదని నిర్ణయించారు. ఈనెల ఒకటి నుంచి 2రోజులపాటు మెట్రో లగ్జరీ ఏసీ సర్వీసులో విధులు కేటాయించారు. దీనిని నడపటంపై ఆయనకు కేవలం 2 రోజులే శిక్షణ ఇచ్చారు. అది సరిపోలేదని చెప్పినా.. ఇలాంటి సర్వీసును మరొక డ్రైవర్‌ను నడుపుతుండగా.. పరిశీలించి నేర్చుకోవాలంటూ ఫాలోయింగ్‌కి ఒకరోజు పంపారు. ఆ తర్వాత నుంచి ఈ బస్సుల్లో విధులు కేటాయిస్తున్నారు. తొలుత ఆదివారం ఇటువంటి సర్వీసు నడిపిన డ్రైవర్‌ ప్రకాశంకు, సోమవారం మరొక బస్‌ ఇచ్చారు. అదే ప్రమాదానికి గురైంది.

Today Road Accidents in AP: విజయవాడ బీఆర్‌టీఎస్‌ రోడ్డులో కారు బీభత్సం.. తప్పిన పెను ప్రమాదం

ఎక్స్​లేటర్​ సమస్య: ప్రమాదానికి గురైన బస్సులో కొంతకాలంగా ఎక్స్‌లేటర్‌ సెన్సార్‌ సమస్య ఉంది. ఎక్స్‌లేటర్‌ తొక్కినపుడు, కాలులేపినపుడు దాని కింద రోలర్‌ ముందుకు, వెనక్కి కదులుతుంది. ఇది సెన్సార్‌కు అనుసంధానమై ఉంటుంది. కొంతకాలంగా సెన్సార్‌ స్ట్రక్‌ అవుతోందని, పెడల్‌ తొక్కి, దానిపై కాలు తీసినపుడు వెంటనే పైకి రాకుండా అలాగే ఉండిపోతోందని డ్రైవర్లు గుర్తించారు. దీనివల్ల కొన్నిసార్లు బస్‌ ఒక్కసారిగా ముందుకు జంప్‌ అవుతోందని డ్రైవర్లు చెబుతున్నారు.

సమస్యను సరిచేయాలని సూచించిన: ప్రమాదానికి గురైన బస్‌ నడిపిన డ్రైవర్‌ కూడా ఇదే విషయం చెబుతున్నారు. వారం కిందట ఒక డ్రైవర్, ఆదివారం ఈ బస్‌ నడిపిన మరో డ్రైవర్‌ సైతం రిపేర్‌ ఎట్‌ గ్యారేజ్‌ షీట్‌లో ఎక్స్‌లేటర్‌ సమస్యను సరిచేయాలని రాసినా.. పరిష్కరించకుండా వదిలేశారు. సోమవారం ఉదయం విజయవాడ బస్టాండ్‌లో బస్‌ డ్రైవర్‌ ఫార్వర్డ్‌ మోడ్‌లో ఉండగా, రివర్స్‌ మోడ్‌లోకి మార్చినట్లు భావించి ఎక్స్‌లేటర్‌ తొక్కారని, అది స్ట్రక్‌ అయ్యి ఒక్కసారిగా ముందుకు కదిలి ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లిందని కొందరు డ్రైవర్లు చెబుతున్నారు.

Live Video.. బిజీ రోడ్​లో జనంపైకి దూసుకొచ్చిన కారు

ఎక్స్‌లేటర్‌ పెడల్‌ వద్ద ప్లాస్టిక్‌ కవరు: ప్రమాదానికి గురైన బస్‌లో ఎక్స్‌లేటర్‌ పెడల్‌కు ప్లాస్టిక్‌ కవరు చుట్టి ఉండటంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. పెడల్‌ కిందకు తొక్కినపుడు అది రోలర్‌ వద్ద ఇరుక్కుపోకుండా పైకి వచ్చేలా లాక్‌ పిన్‌ ఉంటుందని, అది వేయకపోవడంతో చాలాకాలంగా డ్రైవర్లే ఇలా ప్లాస్టిక్‌ కవరు చుట్టి నడుపుతున్నట్లు చెబుతున్నారు. అధికారులు మాత్రం పెడల్‌పై డ్రైవర్‌ కాలి గ్రిప్‌ కోసం అలా ఏర్పాటు చేసుకున్నారని అంటున్నారు. ఎక్స్‌లేటర్‌ పెడల్‌ వద్ద ఉండే సెన్సార్‌ తడిచిపోకుండా ఇలా ప్లాస్టిక్‌ కవరు చుట్టినట్లు మెకానిక్స్‌ చెబుతున్నారు.

ప్రమాదానికి గురైన బస్సు 10లక్షల 65వేల కిలోమీటర్లు తిరిగింది. ఇవి తరచూ మరమ్మతులకు గురవ్వడం, మార్గమధ్యలో ఆగిపోవడం జరుగుతునే ఉంది. ఈ బస్సులు నిర్దేశిత కిలోమీటర్లు ప్రయాణించాక వాటి ఎలక్ట్రానిక్‌ పరికరాలన్నీ కొత్తవి వేయాలి. కానీ ఆ ఊసే ఉండటంలేదు.

డ్రైవర్​ సిక్​ లీవ్​ తర్వాత విధులకు: డ్రైవర్‌ ప్రకాశం ఇటీవల ద్విచక్ర వాహనంపై వెళ్తుంటే కిందపడటంతో సిక్‌ లీవ్‌ తీసుకున్నారు. తర్వాత నుంచి విధులకు వస్తున్నారు. వాస్తవానికి ఆయనకు సోమవారం వారాంతపు సెలవు. అయితే కొద్దిరోజుల తర్వాత ఆయనకు రెండు రోజులు సెలవు కావాలని అధికారులను కోరినట్లు తెలిసింది. వాటిని సర్దుబాటు చేసేందుకు సోమవారం సెలవు అయినా విధులు నిర్వహించాలని సూచించడంతో.. విధులకు వచ్చినట్లు తోటి ఉద్యోగులు చెబుతున్నారు.

తప్పతాగి స్కూల్ బస్సు నడిపిన డ్రైవర్ ప్రమాదంలో 40 మంది విద్యార్థులు

ABOUT THE AUTHOR

...view details