Vijayawada Railway Division: 2022-23 ఆర్థిక సంవత్సరంలో విజయవాడ రైల్వే డివిజన్ రికార్డు స్థాయి ఆదాయం అర్జించింది. డివిజన్ చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయి ఆదాయం ఆర్జించినట్లు రైల్వే డీఆర్ఎం శివేంద్ర మోహన్ తెలిపారు. 2022-22 ఏడాదిలో విజయవాడ రైల్వే డివిజన్ ఏకంగా రూ.5306.8 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. ఇందులో ప్రయాణికుల రవాణా ద్వారా రూ.1246.8 కోట్లు, సరకు రవాణా ద్వారా రూ.3912.15.. కోట్ల ఆదాయం వచ్చినట్లు వివరించారు. దేశంలో మిగిలిన డివిజన్ల కంటే విజయవాడ డివిజన్ అత్యుత్తమ ప్రగతి సాధించినట్లు తెలిపారు. ఏడాదిలో 61.518 మిలియన్ల ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరవేసినట్లు వివరించారు. అత్యధికంగా టికెటేతర ఆదాయం రూ.58.9 కోట్లు వచ్చిందన్నారు. ఈ ఏడాదిలో 146.33. కి.మీ కొత్త లైన్ నిర్మించామని డివిజన్ లో 22 లెవెల్ క్రాసింగ్లు తొలగించి 22 రోడ్ అండర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేశామని తెలిపారు. డివిజన్లో 6 ఫుట్ ఒవర్ బ్రిడ్జిలు నిర్మించినట్లు తెలిపారు.
ఈ ఏడాదిలో విజయవాడ డివిజన్లో 790 ప్రత్యేక రైళ్లు నడిపాం అమరావతికి కొత్త రైల్వే లైన్ ఇంకా సర్వే స్టేజిలో ఉందని అన్నారు. విజయవాడ - విశాఖపట్నం మూడో లైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు తెలిపారు. డివిజన్ పరిధిలో రైల్వే ప్రాజేక్టులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో చేపట్టే పలు ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నట్లు తెలిపిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వకపోవడం వల్లే పనులు పూర్తి కావడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తే పెండింగ్ రైల్వే లైన్ల పనులు పూర్తి చేస్తామని తెలిపారు. విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ది కోసం డీపీఆర్ కోసం కన్సల్టెంట్ను నియమించామని, కన్సల్టెంట్ నివేదిక రాగానే విజయవాడ స్టేషన్లో మరిన్ని అభివృద్ది పనులు చేపడతామని తెలిపారు. అమృత్ ప్రాజెక్టులో భాగంగా డివిజన్లో 15-20 రైల్వే స్టేషన్లను వచ్చే ఏడాదిలోగా అభివృద్ది చేస్తామని వెల్లడించారు.