Vijayawada Old Government Hospital: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో నూతన భవన నిర్మాణం కలగానే మిగిలిపోయేలా ఉంది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు స్వయంగా ఆసుపత్రికి వచ్చి గర్భిణులు, బాలింతల అవస్థలను చూశారు. కొత్త బ్లాక్‌కు యుద్ధప్రాతిపదికన 18 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. కొత్త బ్లాక్ నిర్మాణం ప్రారంభమై.. పునాదులు వేసి, పిల్లర్ల నిర్మాణం జరుగుతున్న సమయంలో.. ప్రభుత్వం మారడం రోగుల పాలిట శాపంగా మారింది. అప్పటివరకూ చేపట్టిన పనులకు కూడా వైసీపీ సర్కార్ బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారు చేతులెత్తేశారు. పునాదుల చుట్టూ ఉన్న రేకులను కూడా తొలగించి తీసుకెళ్లారు.
పాతాసుపత్రికి రద్దీ భారీగా పెరిగింది. వేలాది మంది సాధారణ చికిత్సకు వస్తుంటారు. ఈ హాస్పిటల్లో ఏటా కనీసం 10 వేలకు పైగా ప్రసవాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ ఒక్కో మంచంపై ఇద్దరేసి బాలింతలు పడుకోవాల్సిన దుస్థితి. రోగులకు తోడుగా వచ్చిన బంధువులు వైద్యశాల ప్రాంగణంలోని చెట్లు, గట్ల కిందే వేచి చూడాల్సి వస్తోంది.
Chintalapudi Area Hospital: మూడేళ్లుగా పనులు.. పూర్తయ్యేది ఎన్నడో.. రోగుల ఎదురుచూపులు
ఇలాంటి పరిస్థితుల్లో ఇంకో భవనం నిర్మించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కానీ ఇవేమీ పాలకులకు పట్టడం లేదు. నాలుగేళ్లుగా పట్టించుకోకుండా వదిలేయడంతో ప్రస్తుతం ఆ పునాదులు సైతం శిథిలావస్థకు చేరుకున్నాయి. దీనిని వాహనాల స్టాండ్‌గా వాడుకుంటున్నారు. పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి ఇనుప చువ్వలకు చుట్టుకుంటున్నాయి. తుప్పుపట్టి పాడైపోయిన ఊచలపైనే దుస్తులు ఆరేసుకుంటున్నారు. ప్రస్తుతం నిర్మాణం ఆరంభించాలన్నా.. పునాదుల పటిష్ఠత ఎంతవరకూ సరిపోతుందనేది అనుమానమే కలుగుతుంది.
గర్భిణుల అవస్థలు నాయకులు, అధికారులకు కనిపించడం లేదా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త బ్లాక్ నిర్మాణంపై విజ్ఞప్తులు వచ్చిన ప్రతిసారీ సమీక్షలు చేయడం.. ఆ తర్వాత వదిలేయడం పరిపాటిగా మారింది. ఐదేళ్ల కిందట 18 కోట్లుగా ఉన్న భవన నిర్మాణ వ్యయం.. ప్రస్తుతం మరో 10 కోట్లు పెరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.