High Court on Vijayawada Municipal Commissioner: కోర్టు ధిక్కరణ కేసులో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ హైకోర్టుకు హాజరయ్యారు. ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై విచారణ జరిపింది. కమిషనర్ స్వప్నిల్ దినకర్ తరపు న్యాయవాది సుమన్ వాదనలు వినిపించారు. కోర్టు ధిక్కరణకు పాల్పడటం లేదన్నారు. కోర్టు ఆదేశించిన నిర్దిష్ట గడువు లోపే తగిన ఉత్తర్వులు జారీ చేశారని కోర్టుకు తెలిపారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. కమిషనర్ పై విధించిన కోర్టు ధిక్కరణ కేసు విచారణను మూసివేసింది.
పాములపాటి నాగరత్నమ్మ అక్రమ నిర్మాణం చేపడుతున్నారని, అధికారులకు వినతి సమర్పించినా చర్యలు లేవని పేర్కొంటూ ఏపీ యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్జీఐ క్యాంపెయిన్ అధ్యక్షుడు ఎన్ సత్యనారాయణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. అక్రమ నిర్మాణం విషయంలో పిటిషనర్ ఇచ్చిన వినతిని పరిగణనలోకి తీసుకొని తగిన ఉత్తర్వులు జారీ చేయాలని విజయవాడ కమిషనర్‌ను ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాల మేరకు కమిషనర్ వ్యవహరించలేదని పిటిషనర్ సత్యనారాయణ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. గతంలో విచారణ జరిపిన ధర్మాసనం.. స్వయంగా హాజరు కావాలని కమిషనర్ స్వప్నిల్ దినకర్‌ను ఆదేశించింది.