ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మేనేజరును కస్టడీకి ఇవ్వడానికి నిరాకరణ.. మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి ఉత్తర్వులు - The Sessions Court dismissed the CID petition

Margadshi Chit Fund: మార్గదర్శి చిట్‌ ఫండ్‌ విజయవాడ లబ్బీపేట బ్రాంచి మేనేజరును ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ వేసిన పిటిషన్‌ను.. విజయవాడ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి కొట్టేశారు. మేనేజర్ బండారు శ్రీనివాసరావును పోలీసు కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. మరోవైపు నెల్లూరు, ఒంగోలు కార్యాలయాల్లో సీఐడీ అధికారులు.. వివరాలు సేకరించారు.

Margadshi Chit Fund
Margadshi Chit Fund

By

Published : Mar 17, 2023, 8:25 AM IST

మేనేజరును కస్టడీకి ఇవ్వడానికి నిరాకరణ.. మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి ఉత్తర్వులు

Margadshi Chit Fund: మార్గదర్శి చిట్‌ ఫండ్‌ సంస్థ విజయవాడ లబ్బీపేట బ్రాంచి మేనేజర్‌ను కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ వేసిన పిటిషన్‌ను విజయవాడ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు తోసిపుచ్చింది. మేనేజర్‌ బండారు శ్రీనివాసరావును ఐదు రోజుల కస్టడీకి సీఐడీ కోరగా.. జడ్జి ఆంజనేయమూర్తి పోలీసు కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. కస్టడీకి దర్యాప్తు అధికారి చూపుతున్న కారణాలు సరిగా లేవన్నారు. మేనేజరును కస్టడీలోకి తీసుకొని తెలుసుకోవాలనుకుంటున్న సమాచారం చిట్‌ రిజిస్ట్రార్‌, తదితర మార్గాల ద్వారా సేకరించుకోవచ్చన్నారు. ఇప్పటికే సీజ్‌ చేసిన దస్త్రాల గురించి మేనేజరు నుంచి స్పష్టత తీసుకోవాల్సి ఉందని దర్యాప్తు అధికారి చెబుతున్నారని.. అందుకు పోలీసు కస్టడీ అవసరం లేదన్నారు. చిట్‌ రిజిస్ట్రార్‌, కంపెనీ బ్యాంకు ఖాతాలను పరిశీలించి స్పష్టత పొందవచ్చునని పేర్కొన్నారు.

కొంతమంది సాక్షులను విచారించామని చెబుతున్న దర్యాప్తు అధికారి.. వారి పూర్తి వివరాలను మేనేజరు ఇవ్వలేదని చెబుతున్నారన్న న్యాయమూర్తి.. ఆ సాక్షుల వాంగ్మూలాలను దర్యాప్తు అధికారి నమోదు చేసినప్పుడు వారి వివరాలు తెలిసే ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఆ వివరాలను మళ్లీ మేనేజరు నుంచి తెలుసుకోవాలని ఎందుకు చెబుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని సీఐడీ అదనపు ఎస్పీ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.

విజయవాడ అసిస్టెంట్‌ చిట్‌ రిజిస్ట్రార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 12న సీఐడీ పోలీసులు లబ్బీపేట మార్గదర్శి చిట్‌ఫండ్‌ బ్రాంచి మేనేజర్‌ శ్రీనివాసరావును అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. విచారణ నిమిత్తం శ్రీనివాసరావును తమ కస్టడీకి అనుమతించాలంటూ సీఐడీ పోలీసులు కోర్టులో వ్యాజ్యం వేశారు. మేనేజరు తరఫున న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్‌ వాదనలు వినిపించారు. శ్రీనివాసరావును తప్పుడు కేసులో ఇరికించారని, ఆయన అరెస్టు అక్రమమని పేర్కొన్నారు. దర్యాప్తు అధికారి తీసుకోవాలనుకుంటున్న దస్త్రాలు చిట్‌ రిజిస్ట్రార్‌ నుంచి సేకరించుకోవచ్చునని, అరెస్టు చేయడానికి ముందే మేనేజరును సీఐడీ అధికారులు విచారించి సమాచారం సేకరించారని తెలిపారు. పోలీసు కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని, సీఐడీ వ్యాజ్యాన్ని కొట్టేయాలని న్యాయవాది కోరారు. సీఐడీ తరఫున ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ బెల్లపు సత్యనారాయణ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి కంపెనీ నిర్వహించే దస్త్రాలు, బ్యాంకు ఖాతాల వివరాలు మొత్తం చిట్‌ రిజిస్ట్రార్‌ వద్ద ఉంటాయన్నారు. అక్కడి నుంచి సీఐడీ పొందవచ్చని తెలిపారు.

నెల్లూరు, ఒంగోలు మార్గదర్శి కార్యాలయాలకు గురువారం సీఐడీ సిబ్బంది వచ్చారు. ఒంగోలు కార్యాలయంలో మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌, అకౌంటెంట్‌లుగా ఎవరు పనిచేస్తున్నారో సీఐడీ ఎస్సై కరీముల్లా ఆరా తీశారు. వారి పేర్లు, ఫోన్ నంబర్లు నమోదు చేసుకున్నారు. నెల్లూరులోని వేదాయపాళెం, నర్తకి సెంటర్ శాఖలకు వచ్చిన కానిస్టేబుల్‌ రాజేంద్ర.. మేనేజర్‌, ఆ తర్వాతి స్థాయి ఉద్యోగి ఫోన్‌ నంబరుతో పాటు ల్యాండ్‌లైన్‌, మెయిల్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details