Vijayawada Metropolitan Sessions Court Dismissed The CID Petition: బ్రహ్మయ్య అండ్ కొ ఆడిట్ సంస్థ భాగస్వామి కుదరవల్లి శ్రావణ్‌ను పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ .. ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ విజయవాడ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు(ఎంఎస్‌జే) న్యాయాధికారి వి.శ్రీనివాస ఆంజనేయమూర్తి మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. అందులో.. దర్యాప్తు సంస్థ ఆడిటర్ వద్ద నుంచి ఇప్పటికే ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకుందని, బ్రహ్మయ్య కార్యాలయంలో దర్యాప్తు అధికారులు తనిఖీలు నిర్వహించి కేసుకు సంబంధించిన దస్త్రాలను సీజ్ చేశారని తెలిపారు. కంపెనీ ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిందని గుర్తు చేశారు. న్యాయస్థానం విచారణ చేసి స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.
చిట్ రిజిస్ట్రార్ వద్ద నుంచి మార్గదర్శి చిట్ ఫండ్‌కు సంబంధించిన వివరాలు పొందవచ్చని చెప్పారు. మార్గదర్శి సంస్థ ఆడిటర్‌గా బ్యాంకు ఖాతాల వ్యవహారంలో శ్రావణ్‌కు బాధ్యత ఉండదని ప్రాథమికంగా అభిప్రాయపడ్డారు. శ్రావణ్‌ను పోలీసు కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని కస్టడీ పిటిషన్‌ను కొట్టివేస్తున్నామని న్యాయాధికారి వి.శ్రీనివాస ఆంజనేయమూర్తి ప్రకటించారు. మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థపై నమోదు చేసిన కేసులో భాగంగా తమ ముందు వివరాలతో హాజరు కావాలని బ్రహ్మయ్య అండ్ కొ సంస్థ ఆడిటర్ శ్రావణ్‌కు సీఐడీ నోటీసు ఇచ్చింది. వివరాలను అందజేసేందుకు సీఐడీ ముందు హాజరైన ఆయనను మార్చి 29న అరెస్ట్ చేసింది. 30న ఉదయం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.