Bejawada Kanakadurgamma: జగన్మాత బెజవాడ కనకదుర్గమ్మ మూలవిరాట్ దృశ్యాలు- సామాజిక మాద్యమాల్లోకి రావడం కలకలం సృష్టిస్తోంది. దుర్గమ్మ అంతరాలయాన్ని చరవాణితో చిత్రీకరించి- సామాజిక మాద్యమాల్లో పోస్టు చేయడం ఆలయ అంతర్గత భద్రత వైఫల్యాలను బహిర్గతం చేసింది. అమ్మవారి సన్నిధిలోకి చరవాణిల అనుమతి లేకపోయినా దృశ్యాలను చిత్రీకరించడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్‌టీఎఫ్ భద్రత, ప్రైవేటు సెక్యూరిటీ, సీసీ కెమేరాల నిఘా ఉన్నప్పటికీ దృశ్యాల చిత్రీకరణకు ఎందుకు సాహసిస్తున్నారు? అప్పుడు నియంత్రించాల్సిన భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
వీవీఐపీలు, ముఖ్యుల వెంట వారికి సహాయకులుగా వస్తోన్న వారి ఫోన్లను భద్రతా సిబ్బంది నియంత్రించలేకపోతున్నారు. అలాగే టిక్కెట్టు కొనుగోలు చేసి వస్తోన్న భక్తులను రద్దీ సమయంలో అదుపు చేయడంలోనూ భద్రతా సిబ్బంది వైఫల్యం కనిపిస్తోంది. అమ్మవారి ఆలయాన్ని సందర్శించి తన మొక్కులు చెల్లించుకునేందుకు కొద్దినెలల క్రితం ఓ సినిమా నటుడు వచ్చిన సమయంలో అభిమానులు అమ్మవారి ఆలయంలోని హుండీలపై నిలుచుని మరీ చరవాణిలో దృశ్యాలు బంధించారు. ఆ తర్వాత దేవస్థానం తక్షణ చర్యలుగా ఆలయంలో సంప్రక్షణతోపాటు ఇతర వైదిక కార్యక్రమాలు చేపట్టాల్సి వచ్చింది.