Telugu Book Of Records: పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెతకు నిదర్శనంగా నిలుస్తున్నాడు విజయవాడకు చెందిన సాత్విక్ అనే బాలుడు. ప్రస్తుతం మనం చూస్తున్న బాలుడి వయస్సు 8ఏళ్లే కానీ, అసాధారణ ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తున్నాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోపాటు నిష్ణాతులైన శిక్షకుల సహకారంతో చిన్న వయస్సులోనే అసమాన విజయాలను అందుకుంటున్నాడు. 37 నిమిషాల వ్యవధిలో 1,200 గుంజీలు తీసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నాడు. కేవలం 20 రోజుల సాధనతోనే తమ కుమారుడు ఈ ఘనత సాధించాడని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
చిన్న వయస్సు కావటంతో.. ఇబ్బంది పడతాడేమోనని భావించినా.. సాత్విక్ సాధించి చూపాడని వ్యాయామ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ తెలిపారు. భవిష్యత్తులో మెరుగైన శిక్షణ ఇచ్చి.. మరిన్ని పతకాలు సాధించేలా చేస్తానని ఆయన తెలిపారు. తెలంగాణలో ఓ వ్యక్తి గుంజీలు తీస్తూ చేసిన వీడియో చూడటంతో తనకూ అలా రికార్డు సృష్టించాలనే కోరిక కలిగిందని సాత్విక్ తెలిపాడు. ఇందుకోసం తల్లిదండ్రులు, వ్యాయామ ఉపాధ్యాయుడు ఎంతగానో ప్రోత్సహించారన్నారు. భవిష్యత్తులో బాగా సాధన చేసి మరిన్ని రికార్డులు సృష్టించేందుకు ప్రయత్నిస్తామని సాత్విక్‌తోపాటు వ్యాయామ ఉపాధ్యాయుడు తెలిపారు.