Vijayawada Auto Nagar Labor Problems: వేల మంది కార్మికులకు ఉపాధినిస్తోంది ఆ ఆటోనగర్. నిత్యం ప్రమాదాలతో సహవాసం చేస్తూ జీవనం సాగిస్తుంటారు. భారీ ఇనుప వస్తువులను మరమ్మతు చేసేవారికి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ప్రమాదాలు జరిగినప్పుడు వైద్యసాయం కోసం ఎక్కడికి వెళ్లాలో అర్థం కానీ పరిస్థితి. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్దామంటే అక్కడ ఫీజులకు భయపడుతున్నారు. విజయవాడ ఆటోనగర్‌లో ప్రభుత్వ ఆస్పత్రి లేక కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వేల మందికి ఉపాధి కల్పిస్తున్న ఆటోనగర్: విజయవాడ ఆటోనగర్‌లో సుమారుగా 80వేల నుంచి లక్ష మంది వరకు కార్మికులు పని చేస్తుంటారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల యూనిట్లు 3 వేల వరకు ఉంటాయి. లారీలు, బస్సుల బాడీ బిల్డింగ్, వెల్డింగ్, టింకరింగ్, రిటైంరింగ్, ఫౌండ్రీ వంటి పనులు చేస్తుంటారు. నిత్యం కార్మికులు ఏదోవిధంగా ప్రమాదాల బారిన పడుతుంటారు. సిలిండర్లు పేలడం, డీజిల్ ట్యాంకులకు మంటలు అంటుకుని కార్మికులు గాయపడిన సందర్భాలు చాలా ఉన్నాయి.
ఫ్లాట్లు ఇచ్చారు, పాట్లు మిగిల్చారు - ఆటోనగర్ అంటేనే భయపడుతున్న వాహనదారులు
ప్రమాదాలకు గురైతే అప్పులు చేయాల్సి వస్తోంది : ప్రమాదాలు జరిగినప్పుడు దగ్గర్లో ఆస్పత్రి సదుపాయం లేకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రోజువారీ కూలి పనులు చేసుకునే కార్మికులకు ప్రమాదాలు జరిగినప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కూలి పనులు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నామని, వైద్య ఖర్చులు తలకు మించిన భారంలా మారాయని వాపోతున్నారు.