విజయవాడ-హైదరాబాద్ మార్గంలో రాకపోకలు పునరుద్ధరణ Vehicles Allowed on NH-65 at Ithavaram : గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో పలు గ్రామాలు నీట మునిగాయి. మునేరు వాగు ఉద్ధృతితో జాతీయ రహదారిపై సైతం భారీ స్థాయిలో వరద నీరు చేరడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద గురువారం సాయంత్రం 4 గంటల నుంచి వాహనాల రాకపోకలను నిలిపివేసిన విషయం అందరికీ తెలిసిందే. జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోవడంతో మహిళలు, చిన్నారులు తీవ్ర అవస్థలు పడ్డారు. వివిధ వ్యక్తిగత పనులుపై వివిధ ప్రాంతాలకు వెళ్లి స్వంత గ్రామానికి చేరుకోవడానికి తీవ్ర వేదన అనుభవించారు. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను వేరే మార్గం గుండా తరలించారు.
రాకపోకలు పునఃప్రారంభం :శుక్రవారం సాయంత్రానికి ఐతవరం వద్ద వరద తగ్గుముఖం పట్టింది. అదే సమయంలో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై కూడా వరద ప్రవాహం తగ్గింది. దీంతో నేషనల్ హైవేపై రాకపోకలకు అధికారులు అనుమతి ఇచ్చారు. పోలీసులు దగ్గర ఉండి ఒక్కొక్క వాహనాన్ని పంపిస్తున్నారు. దాదాపు 26 గంటల తరువాత ఐతవరం వద్ద రాకపోకలు తిరిగి ప్రారంభం అయ్యాయి. శనివారం మధ్యాహ్నానికి పూర్తి స్థాయిలో వాహన రాకపోకలకు అధికారులు అనుమతిచ్చే అవకాశం ఉంది.
విద్యార్థుల కష్టాలు : పరీక్షలకు రాసేందుకు వెళ్లే విద్యార్థులు చాలా అవస్థలు పడ్డారు. రాయలసీమ జిల్లాల నుంచి ఎంటెక్ సప్లిమెంటరీ పరీక్షలు రాయడానికి ఎన్టీఆర్ జిల్లా నందిగామ వచ్చారు. జాతీయ రహదారిపై రాకపోకలకు అనుమతించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. అధికారులు, పోలీసులకు స్పందించి తమకు పరీక్ష కేంద్రాలకు తరలించాలని విద్యార్థులు మొర పెట్టుకున్నారు. తాము పరీక్షలు రాయకపోతే ఒక విద్యా సంవత్సరం వృథా అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆ విద్యార్థులను నందిగామ పరీక్ష కేంద్రానికి క్రేన్ సహయంతో తరలించారు. దీంతో విద్యార్థలు ఆనందం వ్యక్తం చేశారు.
ప్రజల అవస్థలు :నందిగామ మండలం కంచల గ్రామాన్ని వర్షపునీరు చుట్టుముట్టింది. కంచల గ్రామానికి రెండు వైపులా రహదారులు వర్షపు నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయాయి. దీంతో ఈ గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వ్యక్తిగత పనుల నిమిత్తం గ్రామం విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లిన ప్రజలు సొంత ఇంటికి చేరుకోలేక తీవ్ర అవస్థలు పడ్డారు. కంచల గ్రామానికి రెండు వైపులా రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. మనిషి లోతు వరద నీరు ప్రవహిచడంతో రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో కంచల గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తెలంగాణ, ఏపీ సరిహద్దు ప్రాంతంగా ఉన్న ఎన్టీఆర్ జిల్లాలో పలు మండలాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. భారీ వర్షాలు, వరదలు తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడాలని ప్రజలు కోరుకుంటున్నారు.