ఆకాశాన్నంటిన కూరగాయల ధరలు Vegetable Prices Raised in Vijayawada: విజయవాడలో కూరగాయల ధరలు కొండెక్కాయి. అవసరాలకు సరిపడా కూరగాయలు లేకపోవడంతో నగర ప్రజలు అల్లాడిపోతున్నారు. వారం రోజుల వ్యవధిలోనే దాదాపు అన్ని రకాల ధరలు రెట్టింపు అయ్యాయి. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే... పెరిగిన కారగాయల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి.
విజయవాడ పటమటలోని రైతుబజార్‌లో డిమాండ్‌కు అనుగుణంగా కూరగాయల దిగుమతి లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్‌లో కూరగాయల ధర ఎప్పుడు, ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. రోజు వ్యవధిలోనే టమాటో ధరలు 50 రూపాయల పైగా ఎగబాకడం కొసమెరుపు. వారం రోజుల కిందట 150కు వచ్చిన సరకులు ఇప్పుడు 300 పట్టుకెళ్లినా రావడం లేదని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పచ్చిమిర్చి కొందామంటే దొరకడం లేదని.. ఉన్న కొద్దిపాటి నిల్వలు కూడా గంటల వ్యవధిలోనే అయిపోతున్నాయని చెబుతున్నారు.
మరోవైపు కూరగాయలు నాణ్యతగా కూడా లేవని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రైతు బజారుల్లో టమాటా, అల్లం, పచ్చిమిర్చి కొరత తీవ్రంగా వేధిస్తుంది. అవసరమైన కూరగాయలు లేవని కొందరు వెనుదిరుగుతుంటే... మరికొందరు ప్రత్యమ్నాయ కూరగాయలు కొనుగోలు చేసి సరిపెట్టుకుంటున్నారు.
"ప్రజలు కొనే విధంగా కూరగాయల ధరలు లేవు. నాణ్యత కూడా బాగా లేదు. దాదాపు రెట్టింపయ్యాయి. 15 రూపాయలకు కిలో ఉన్న కూరగాయలు.. ఇప్పుడు 30 రూపాయలు ఉన్నాయి." -కొనుగోలుదారులు
మార్కెట్లలో ఆకాశాన్నంటిన ధరలు చూసి నగరవాసులు బేజారెత్తిపోతున్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో కూరగాయల ధరలు తగ్గుతాయని భావించినప్పటికీ వారి ఆశలు అడియాశలయ్యాయి. ఇప్పటికే పెరిగిన గ్యాస్, కరెంట్ ఛార్జీలు ప్రజల ఆర్థిక జీవనాన్ని చిన్నాభిన్నం చేస్తుంటే... ఆ జాబితాలో కూరగాయలు చేరడం ప్రజల్ని మరింత ఆందోళనకు గురిచేస్తుంది. ధరల పెరుగుదల మీద ప్రభుత్వాల నియంత్రణ లేకపోతే ఎలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దళారుల దోపిడిని అరికట్టి ప్రజలకు అండగా నిలవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం 50 రూపాయలు పైగా ఉన్న కిలో టమాటో ధర... మరికొన్ని రోజులు ఇలానే కొనసాగుతుందని మార్కెట్ నిర్వాహకులు చెబుతున్నారు. సాగు తగ్గడంతోనే అల్లం, పచ్చిమిర్చి కొరత నెలకొందని రైతులు చెబుతున్నారు. కూరగాయల ధరలు అమాంతంగా పెరగడానికి వాతావరణంలో వచ్చిన అనూహ్య మార్పులే కారణమని రైతు బజారు అధికారి చెబుతున్నారు.
"కూరగాయల ధరల్లో టమాటా, మిర్చి ధరలు ఎక్కువగా పెరిగాయి. పరిసర ప్రాంతలోని చుట్టుపక్కల పంటలు దెబ్బతిన్నాయి. రైతులు వాణిజ్య పంటలకు మొగ్గు చూపటం, వాతవరణంలో మార్పులు కూడా కూరగాయల ధరపై ప్రభావం చూపించాయి" -కరుణాకర్, కార్యనిర్వాహక అధికారి, పటమట రైతు బజారు