UTF Leaders Relay Deeksha Updates: 'సీపీఎస్ విధానం వద్దు-పాత పెన్షన్ విధానమే ముద్దు' అనే నినాదంతో ఈ నెల 18వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాల నేతలు నిరవధిక దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు 18వ తేదీన రాష్ట్ర యూటిఎఫ్ కేంద్రాల్లో, 19వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో నిరవధిక దీక్షలు చేపట్టిన నేతలు.. 20వ తేదీన (శుక్రవారం) ఎన్టీఆర్, ప్రకాశం, శ్రీ సత్యసాయి, శ్రీకాకుళం, అల్లూరి సీతరామరాజు జిల్లాలోని తాలూకా, డివిజన్ కేంద్రాల్లో నిరవధిక దీక్షలు చేపట్టారు.
NTR District:రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి.. పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ.. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో యూటీఎఫ్నాయకులు రిలే దీక్షలు ప్రారంభించారు. సీపీఎస్, జీపీఎస్ విధానాలను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీపీఎస్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఉద్యోగులు నష్టపోతున్నారని వాపోయారు. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.
Prakasam District:సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని కోరుతూ.. ప్రకాశం జిల్లా మార్కాపురంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు దీక్ష చేపట్టారు. అధికారంలోకి వస్తే సీపీఎస్‌ను రద్దు చేస్తామన్న ముఖ్యమంత్రి జగన్.. ఉద్యోగులను మోసం చేసి జీపీఎస్ విధానాన్ని తీసుకువచ్చారని దుయ్యబట్టారు. సీపీఎస్ కంటే జీపీఎస్ చాలా అన్యాయమైందని ఆగ్రహించారు. వెంటనే సీఎం జగన్ స్పందించి జీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు.
Sri Sathya Sai District:పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షలో భాగంగా సీపీఎస్‌ను, జీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను తీసుకురావాలని నినాదాలు చేశారు.