UTF LEADERS PROTEST: గుంటూరులో ఉపాధ్యాయ సంఘం, యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పెద్దఎత్తున ఉద్యమించారు. బకాయిలు చెల్లించాలంటూ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. మంత్రులు చెబుతున్నట్లు తమవి గొంతెమ్మ కోర్కెలు కావని.. తాము దాచుకున్న సొమ్ములే తిరిగి ఇవ్వాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ఈ నెల 30 లోపు బకాయిలు చెల్లించకపోతే పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఉపాధ్యాయ సంఘ నాయకులు హెచ్చరించారు.
"వారం రోజుల్లో మీ బకాయిల చెల్లిస్తామని చెప్తున్నా ప్రభుత్వం ఏ వారమో చెప్పటం లేదు. మా జీతాల నుంచి కట్ చేసిన డబ్బులే మాకు ఇవ్వమని అంటున్నాం. గొంతెమ్మ కోరికలు కోరటం లేదు." -నక్కా వెంకటేశ్వర్లు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
"మేము దాచుకున్న డబ్బులు మాకు తిరిగి ఇవ్వమని అడుగుతున్నాము. పీఎఫ్ లోన్ పెట్టి సంవత్సరం దాటిపోయింది. ప్రభుత్వం ఈ రుణాలను ఇంతవరకు ఇవ్వటంలేదు. దాచుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని ధర్నా, నిరసన కార్యక్రమాలు చేస్తున్నాము." -కుసుమ కుమారి, యూటీఎఫ్ సహాధ్యక్షురాలు
గత ఎన్నికల సమయంలో జగన్ మోసపూరిత హామీలు ఇచ్చారంటూ.. విశాఖలో ఉపాధ్యాయులు ఆందోళన చేశారు. అధికారం చేపట్టిన తర్వాత తమను నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జీవీఎంసీ గాంధీ పార్క్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. విజయనగరం కలెక్టరేట్ మహాధర్నాలో పెద్దఎత్తున ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కనీసం ఉపాధ్యాయులకు సకాలంలో వేతానాలు కూడా చెల్లించలేని స్థాయికి ప్రభుత్వం దిగజారిపోయిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద కూడా యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.