Central Minister of State fire on ap govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై, సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్‌పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుంటూరు, విజయవాడ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో గత రెండు రోజులుగా పర్యటించిన మంత్రి.. ఈరోజు విజయవాడలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన పుస్తకాలను ఆమె ఆవిష్కరించారు.
జగన్ ప్రభుత్వంపై కేంద్ర సహాయ మంత్రి ఆగ్రహం..కేంద్ర సహాయ శాఖ మంత్రి భారతి ప్రవీణ్‌పవార్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తిని పాటిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర నిధులతో చేపట్టిన కార్యక్రమాలకు ఎక్కడి నుంచి నిధులు అందుతున్నాయో.. ఆ విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ప్రస్తావించడం లేదని ఆమె దుయ్యబట్టారు.
కేంద్రం సాయం.. రాష్ట్రం పేరు..: అనంతరం రాష్ట్రానికి.. కేంద్ర ప్రభుత్వం నుంచి అందిన సహకారాన్ని ప్రజలకు తెలియకుండా, ముద్రణలు లేకుండా ఎందుకు చేస్తోందో తెలియడం లేదని..కేంద్ర సహాయ శాఖ మంత్రి భారతి ప్రవీణ్‌పవార్ మండిపడ్డారు. సహాయం కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే.. అంతా తమదే అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తమ పేరును ప్రచారం చేసుకుంటోందని నిప్పులు చెరిగారు. తాను తొలి నుంచి ఇదే అంశంపై పలుమార్లు ప్రస్తావించానని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ఎనిమిది లక్షల కోట్ల రూపాయల నిధులు అందజేస్తున్నా.. ఆ మేరకు లబ్ధిపొందుతూ కూడా ఆ సంగతి ప్రజలకు తెలియకుండా చూడడం సరికాదన్నారు. తాము ఏం చేశామనే విషయాలను ప్రజలకు వివరిస్తామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనపూర్తవుతున్నందున నెల రోజులపాటు వివిధ కార్యక్రమాలను చేపడుతున్నామని.. మంత్రి భారతి ప్రవీణ్‌పవార్ తెలియజేశారు.
''రాష్ట్రాభివృద్ధి కోసం, పలు ప్రాజెక్టుల కోసం వేల కోట్ల రూపాయల నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. ఇప్పటికే మంగళగిరిలో ఎయిమ్స్ ఏర్పాటు చేశాం. వైద్య కళాశాలలకు సాయం చేశాం. విద్యార్థులకు పీజీ సీట్లు పెంచాం. ఆయుష్మాన్ భారత్ పేరుతో ఐదు లక్షల బీమా సౌకర్యం కల్పించాం. కరోనా సమయంలో ఉదారంగా రాష్ట్రానికి సహకరించాం. ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరులో కిడ్నీ సమస్యలు అధికంగా ఉన్నాయని తెలిసి అక్కడి పేద ప్రజల కోసం డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేశాం. జల జీవన్ మిషన్ ద్వారా నాణ్యమైన తాగు నీటిని ప్రజలకు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. అందరితో కలిసి, అందరికీ అభివృద్ధి.. అందరి విశ్వాసం మా ప్రభుత్వ మూల మంత్రం.''- భారతి ప్రవీణ్‌పవార్, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి